-వినియోగదారులకు కచ్చితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి
-అపరాధ రుసుము నిర్ణయించే అధికారం కమిటీ సభ్యులకు ఉంది
-ఇసుక పాలసీ యొక్క సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థ ఉండాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారునికి ఇసుక ఎంత ధరకు అందుబాటులో ఉంది అన్న వివరాలు పూర్తి పారదర్శకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేపట్టాలని, అధికారులు సిబ్బంది విధులు – బాధ్యతల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, ఎస్పీ పి జగదీష్ ఇన్చార్జి జెసి కే దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సమన్వయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఏరోజుకారోజు ఏ మేరకు స్టాకు నిలువ ఉన్నది ఎంత వినియోగం జరిగినది తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ కి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 43 అనుసరించి నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనానికి సంబంధించి ఎంత మేర ఇసుక తరలిస్తున్నారో అంచనాకు వచ్చి ఆమేరకు నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. నియమ ఉల్లంఘన పాటించిన వారిపై అపరాధ రుసుం విధించాలని, ఇందుకు డి ఎల్ ఎస్ ఏ కమిటీ లో ఉన్న అధికారులకి అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు. వాహన పరిమితి కి మించి ఇసుక రవాణా చెయ్యరాదు అని పేర్కొన్నారు. ప్రతి వాహనానికి తప్పకుండా జి పీ ఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చెయ్యాల్సి ఉందన్నారు. స్టాకు పాయింట్లు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా స్టాక్ పాయింట్ల ఇన్చార్జి గా వ్యవహరించే వ్యక్తులకు పూర్తిస్థాయిలో స్టాకు వివరాలు, తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సంబంధిత వ్యక్తుల పూర్తి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంతవరకు నిర్వహించిన ఏజెన్సీ నుంచి స్వాధీనం చేసుకున్న 7 స్టాక్ పాయింట్ , జిల్లాలోని 31 డి-సిల్టేస్షన్ పాయింట్స్ వద్ద ఉన్న స్టాక్ వివరాలు మైన్స్, ఇరిగేషన్ అధికారులు వివరించారు. జిల్లాలో స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.270/-,
డి-సిల్టేస్షన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.420/- గా ధరను నిర్ణయిస్తూ సమావేశంలో తీర్మానించడం జరిగింది. స్టాక్ పాయింట్ వద్ద జూలై 9 వ తేదీన 2390 మెట్రిక్ టన్నులను వినియోగదారులకు అందచేయగా, 3 లక్షల 261 మెట్రిక్ టన్నులు లభ్యత కలిగి ఉందన్నారు. ప్రతి రోజూ రాత్రి 6 తర్వాత స్టాక్ ముగింపు, తదుపరి రోజూ ప్రారంభ నిల్వగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేలా, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఆమేరకు క్యూ లైన్ క్రమబద్ధీకరించేందుకు ఆయా పాయింట్స్ ఇన్చార్జి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులు డి-సిల్టేస్షన్ రిజర్వాయర్లు, ట్యాంకు బండ్స్ ను గుర్తించాలని కలెక్టర్ ప్రశాంతి తెలియ చేశారు. అందుకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేలా క్లియరెన్స్ ధృవీకరణ పొందాల్సి ఉందన్నారు. త్రవ్వకాల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మైన్స్, ఇరిగేషన్ సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు.
జిల్లా సూపరీంటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ మాట్లాడుతూ సేబ్ , పంచాయతీ రాజ్, పోలీసు, రెవెన్యూ శాఖ లు ఆధ్వర్యంలో సమీకృత చెక్ పోస్టులను నిర్వహించాజ్ ఉంటుందని తెలిపారు. ట్రక్ షీట్స్ జారీ చేసే సమయంలో లోడింగ్ పాయింట్ సమయము కచ్చితంగా ఉండాలని ఆ మేరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆరు తర్వాత ఇసుక రవాణా జరగకుండా స్టాక్ పాయింట్ల వద్ద ముందే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇసుక లావాదేవీలు సంబంధించి పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ విధానం అమలు చేయాల్సింది అన్నారు. డిపిసి ఆమోదించిన ధరల ప్రకారం వినియోదారులకు ఇసుక లభ్యత రవాణా ఖర్చులు పై చర్య తీసుకోవాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు పరిరక్షణ నిఘా వ్యవస్థ పటిష్ఠం చేయాలన్నారు. ఇసుక కోరే వినియోగదారుల ఆధార్ , ఫోన్ నెంబర్, అధికారిక ఇంటి ప్లాన్, లేదా సంబంధిత పట్టణ ప్లానింగ్ విభాగం అధికారి / గ్రామ పంచాయతీ కార్యదర్శి ధ్రువపత్రాలు తప్పని సరి అన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, మైన్స్ సహాయ సంచాలకులు ఎం సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఈ ఈ జి. కాశీ విశ్వేశ్వర రావు, ఆర్టీవో కె వి కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.బాల శంకర రావు, డిపిఓ డి .రాంబాబు, ఇరిగేషన్ డి ఈ రమేష్, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News