మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగినపూడి బీచ్ ను రాష్ట్రానికే తలమానికంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా సాధన కార్యక్రమం తొలిసారిగా మంగినపూడి సముద్ర తీరాన ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా చేస్తున్న యోగా సాధనకు భిన్నంగా ఆదివారం సముద్ర తీరాన ప్రకృతి ఒడిలో చల్లని ఆహ్వాదకర వాతావరణంలో సముద్రపు అలల సవ్వడి మధ్యన, పక్షుల కిలకిల రావాల నడుమ ఎంతో వినూత్నంగా సాగింది.
రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొని యోగాసనాలు వేసి అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, మద్దాల చింతయ్య , శీలం రమేష్, రేఖలు ఛాలన క్రియలు, వజ్రాసనం, నాడీ శోధన, భ్రమరి, ప్రాణాయామం వంటి యోగా ప్రక్రియలు సాధన చేయించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ను బృందావ గార్డెన్ లాగా అన్ని విధాల అభివృద్ధిపరచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన కల అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మంగినపూడి బీచ్ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. సముద్ర ఒడ్డున ఎత్తు పెంచి గోడ కట్టించామని ,గతంలో నడిచి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతుంటే రహదారిని కూడా నిర్మించామని, మొదటి దశలో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్డు వేశామని మరలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఇంతలో తమ ప్రభుత్వం మారిపోయి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందన్నారు.
హిందువులు, ముస్లింలు సాంప్రదాయబద్ధంగా కార్తీక పౌర్ణమి వంటి పండుగ దినాల్లో సముద్ర స్నానాలు చేస్తారన్నారు. వారికి మంచినీరు, దుస్తులు మార్చుకునే గదులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాదు ప్రజలు వారాంతంలో ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారని వారందరూ మంగినపూడి బీచ్ కి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ రిసార్ట్లు ,మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, దుస్తులు మార్చుకొనుటకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా అడుగులు వేయడానికి కొంతమంది రాజకీయేతర పెద్దలతో బీచ్ అభివృద్ధి కమిటీని త్వరలో ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. బీచ్ లో రిసార్ట్ లు ఏర్పాటు చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారని, బహుళ జాతీయ కంపెనీలు కూడా నిధులు సమకూర్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. అలాగే టెంపుల్ టూరిజం ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కూడా బీచ్ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని ఆ సమయంలో ఇసుక వేస్తే రాలనంత లక్షలాది జనం వచ్చారని, బోటు షికారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆనాడు ఉత్సవాలు బాగా చేస్తున్నారని, వచ్చిన పర్యాటకులను చాలా జాగ్రత్తగా వారి స్వస్థలాలకు చేరుకునేలా చూడాలని సూచించారన్నారు. ప్రతి ఆదివారం బీచ్‌కు మచిలీపట్నం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి 6 నుంచి 7 వేల మంది ప్రజలు వస్తున్నారన్నారు. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం యోగా తరగతులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు.
ప్రస్తుతం సాయంత్రం 5 గంటల వరకు బీచ్ లోకి అనుమతి ఉందని రాబోయే రోజుల్లో రాత్రి 8 గంటల వరకు అనుమతించేలా చూస్తామన్నారు. అంతకుముందే బీచ్ లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికీ ఏలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు గట్టి భద్రత చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇవాళ చెన్నై నుంచి కొంత మంది నిపుణులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వస్తున్నారని, వారు విజయవాడ నుంచి మచిలీపట్నం, మళ్లీ ఇక్కడ నుండి విశాఖపట్నం వెళ్లడానికి సీ ప్లేన్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఏ పనైనా చేతకాదని విరమించుకోవద్దని ప్రతిరోజు ప్రయత్నిస్తూ రోజురోజుకు క్రమక్రమంగా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఐఏఎస్ అకాడమీ శిక్షణలో ఉన్నప్పుడు తాను జిమ్ములో ఎక్కువసేపు వ్యాయామాలు చేయలేకపోతున్నానని బాధపడ్డానన్నారు. తర్వాత రోజు రోజుకు వ్యాయామాల సమయం పెంచుకుంటూ మెరుగుపరుచుకున్నానని తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. చాలా కాలంగా మన శరీరం పెద్దగా చలానం లేకుండా ఉండిపోయామని నేడు కపాలభాతి, నాడీ శోధన వంటి యోగాసనాలు చేసే సమయంలో కొంత ఇబ్బంది ఉండొచ్చని దాన్ని అధిగమించుకుంటూ అంకితభావంతో చేస్తే మనమందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. యోగాసనాలు చేయగలమని విశ్వాసం మనలో ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగం తరపున యోగా సాధన కార్యక్రమాన్ని కచ్చితంగా కొనసాగిస్తామన్నారు. కోవిడ్ తర్వాత అందరికీ ధనం కన్నా ఆరోగ్యమే ముఖ్యమని అర్థమైందని ఆ దిశగా ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తున్నారన్నారు.
సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ దర్గా కార్యక్రమానికి యోగా కార్యక్రమానికి మంచి స్పందన లభించడం శుభ పరిణామం అన్నారు. స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ మాట్లాడుతూ మొక్కలను విరివిగా నాటి కలుషితం అవుతున్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తదుపరి మంత్రివర్యులు ప్రభుత్వ ఉద్యోగులకు యోగా సాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ యోగా గురువులు ముదిగొండ శాస్త్రి చింతయ్య టీటీడీ ధర్మ ప్రచార కార్యకర్త భాగవత కళాకారిణి మాధవి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీ కళ్యాణి కూడా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషం. తదనంతరం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ తో కలిసి సముద్ర తీరం వెంబడి స్వచ్చీకరణ కార్యక్రమాన్ని చేపట్టి స్వయంగా చెత్తాచెదారాలను. ఎత్తి చెత్తబుట్టలో వేసి ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, డిపిఓ నాగేశ్వర నాయక్, టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య పలువురు యోగా సాధకులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News