– పథకం లబ్ధికి రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలి
– లక్ష ఇన్‌స్టలేషన్స్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం కింద ఎలాంటి ముందస్తు పెట్టుబడి లేకుండా రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాయితీ మినహా మిగిలిన రూ. 1,02,000ను తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. ఈ ఇంటి పైకప్పు సోలార్ ప్యానెల్ ప్రాజెక్టు జీవితకాలం 25 ఏళ్లు ఉంటుందని, మొత్తంమీద రూ. 8,27,369 ఆదా అవుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, జిల్లాలో వచ్చే మార్చి నాటికి 20 వేల వరకు రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని, అదే విధంగా 2027, మార్చి నాటికి లక్ష ఇన్‌స్టలేషన్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ప్రభుత్వ ఉద్యోగులు తొలుత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కుటుంబానికి ఆర్థిక ఆసరాతో పాటు పర్యావరణానికి మేలుచేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ మురళీమోహన్, డీఈ (టెక్) హనుమయ్య, నోడల్ అధికారి భాస్కర్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News