-స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పెర్ఫార్మెన్స్ అవార్డు విభాగంలో AP మొదటి స్థానం
-స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్(SEEI)-2024లో25 పాయింట్లు సాధించిన రాష్ట్రం
-SEEI 2023లో రాష్ట్రం25 స్కోర్‌తో పోలిస్తే 4.8 శాతం మెరుగుదల
-ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్-2024ను అందచేసిన పునరుత్పాదక ఇంధన శాఖ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్
-ఇంధన సామర్థ్యం కార్యక్రమాలలో అన్ని విభాగాలను భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వం విజయవంతం
న్యూఢిల్లీ / విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో భవనాలు, పరిశ్రమ, మున్సిపాలిటీ, వ్యవసాయం, డిస్కాములు, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం, అమలు చేయడంలో సుస్థిర ప్రదర్శన కనపరిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2024 లో రాష్ట్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ పెర్ఫార్మన్స్ అవార్డు (గ్రూప్-2) విభాగంలో మొదటి బహుమతి సాధించింది.
2024 డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా, పునరుత్పాదక ఇంధన శాఖ గౌరవ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్, న్యూఢిల్లీ వజ్ఞాన్ భవన్‌లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రతిష్టాత్మక జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2024ని ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ ఎనర్జీ & రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సిఈఓ బీఏవీపీ కుమార రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు.
కేంద్ర విద్యుత్ శాఖ కు సంబందించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), రాష్ట్రాలను వారి ఎనర్జీ వినియోగం ఆధారంగా నాలుగు గ్రూపులుగా విభజించింది. ఆంధ్రప్రదేశ్, గ్రూప్-II రాష్ట్రంగా పరిగణించబడింది, ఇందులో ఉన్న రాష్ట్రాల మొత్తం ఇంధన వినియోగం 5 నుండి 15 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ ఇంధనం (Mtoe) మధ్య ఉంటుంది. రాష్ట్రం గ్రూప్-IIలో ఉత్తమ ప్రదర్శన కనపరిచి, స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ -2024లో 87.25 పాయింట్లు సాధించింది. ఇది 2023 స్కోర్ 83.25 తో పోల్చుకుంటే సుమారు 4.8 శాతం పెరిగింది.
ఈ సందర్భంగా బీఏవీపీ కుమార రెడ్డి మాట్లాడుతూ ఎనర్జీ ఎఫిషియెన్సీ కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ల సహాయ సహకారాలు , అలాగే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలు, వినియోగదారుల సహకారం ఈ అవార్డు సాధించడంలో కీలక కారకంగా నిలిచాయని తెలిపారు. ప్రభుత్వం అన్ని విభాగాలలో ఎనర్జీ ఎఫిషియెన్సీని ప్రోత్సహించడానికి ఎనర్జీ కన్జర్వేషన్ సెల్‌లను ఏర్పాటు చేసి, ప్రతిష్టాత్మక ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024ను ప్రవేశపెట్టిందని తద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, పర్యావరణ పరిరక్షణలో , ఇంధన వనరులను కాపాడడంలో ఈ పాలసీ దోహదపడుతుందని తెలిపారు. అలాగే, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024-29)తోపాటు ఎంఎస్ఎంఈలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఇతర పాలసీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ అవార్డు కైవసం చేసుకోవటానికి ఆంధ్ర ప్రదేశ్ ఎంతో కృషి చేసిందని, కమర్షియల్ భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) అమలు, రెసిడెన్షియల్ భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోత్సాహం, వివిధ పాఠశాలలు, ఆస్పత్రులు మరియు ఐటీఐ కాలేజీలలో అమలుచేసిన పైలట్ ప్రాజెక్టులు , మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీల అమలు , అలాగే నూతన ఎనర్జీ కన్జర్వేషన్ పాలసీ, రాష్ట్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ యాక్షన్ ప్లాన్ (SEEAP) వంటివి ఈ ప్రతిష్టాత్మక అవార్డు కు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చని బీఏవీపీ కుమార రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అత్యుత్తమ చర్యలు మరియు విధానాలు ఈ విజయం సాధించడంలో సహాయపడ్డాయని చెప్పారు. ఏపీఎస్ఈసిఎం ఎల్లప్పుడూ రాష్ట్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.
స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ -2024 కోసం సమయానికి అవసరమైన సమాచారం అందించడంలో అన్ని విభాగాలు, పరిశ్రమలు, డిస్కాములు, రవాణా, హౌసింగ్, రోడ్స్ మరియు భవనాల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News