మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు.
గ్రామీణ అభివృద్ధి అంశంపై 2వ స్థాయి సంఘ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇస్తున్న పింఛన్లన్నీ ఇప్పుడు కూడా ఇస్తున్నారా? పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారా? గత ప్రభుత్వ కాలంలో పింఛన్ల కోసం ఆన్లైన్లో ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేశారా? అని పలువురు సభ్యులు ప్రశ్నించగా, అందరికీ పింఛన్లు ఇస్తున్నట్లు, పింఛన్లు వెరిఫికేషన్ ప్రస్తుతం జరగడంలేదని, కొత్త పింఛన్లు ఇంకా మంజూరు కాలేదని అధికారులు సమాధానం ఇచ్చారు. కృష్ణాజిల్లాలో 2,36,934 మందికి పింఛన్లు డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సభ్యులకు సమాచారం అందడం లేదని సభ్యులు తెలుపగా, అధికారులు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ప్రజాప్రతినిధులకు ముందుగా చేరవేయాలని చైర్పర్సన్ సూచించారు. ఎక్కడైనా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే రాతపూర్వకంగా తమకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఉపాధి హామీ పథకం అమలుపై జరిగిన చర్చలో కేవలం రోడ్ల వెంబడి మొక్కలు ఎక్కువగా నాటడం కంటే పాఠశాలలు కళాశాలలు ఆవరణలో పండ్ల మొక్కలు నాటితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. గృహ నిర్మాణం పై జరిగిన చర్చలో కృష్ణాజిల్లాలో పీఎంఏవై గ్రామీణ్ పథకం కింద జూన్ నుంచి ఇప్పటిదాకా జిల్లాలో మంజూరైన 8004 గృహాలకు గాను 448 గృహాలు పూర్తికాగా, 3021 గృహాలు పునాదులు ఆపై స్థాయిలో ఉన్నాయని, 4536 గృహాలు ఇంకా స్టార్ట్ కాలేదని అధికారులు తెలిపారు.
గృహ నిర్మాణం మొదలుపెట్టని వారి నుండి స్థలాన్ని తీసేసుకుంటారని అనుకుంటున్నారని, ప్రస్తుతం గృహాలు నిర్మించుకుంటున్న వారికి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 4 లక్షలు ఇవ్వడంలేదని సభ్యులు లేవనెత్తిన అంశంపై అధికారులు వివరణ ఇస్తూ పాత స్కీం సంబంధించి ఇంటి నిర్మాణానికి 1.80 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నట్లు, లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నట్లు, కొత్త స్కీం సంబంధించి నిబంధనలు రావాల్సి ఉందని తెలిపారు. స్థలాలు వెనక్కి తీసుకోవడం జరగడం లేదని తెలిపారు. జనవరి 3న నిర్మాణాలు పూర్తయిన లక్ష గృహాలు ఇంటి తాళాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనున్నదని అధికారులు తెలిపారు. అర్హులై ఉండి గృహాలు లేని వారికి గృహాలు మంజూరు చేసేందుకు ప్రస్తుతం డిమాండ్ సర్వే నడుస్తోందని అధికారులు తెలిపారు. కేసరపల్లిలో జగనన్న కాలనీకి అప్రోచ్ రోడ్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని సమస్య పరిష్కరించాలని సభ్యులు కోరారు.
15 ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలకు మొదటి త్రైమాసికం నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్లు, సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలకు గౌరవ వేతనం చెల్లించుటకు బడ్జెట్ విడుదల అయిందని డిపిఓ ఇన్చార్జి మరియు జెడ్పీ సీఈవో కన్నమ నాయుడు సభలో తెలిపారు. గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు ఉపాధి హామీ పథకం కింద చేపడతారని, ఇవి కాకుండా ఇతర పనులు గ్రామపంచాయతీలు చేపట్టాలని సూచిస్తూ జిల్లాలో ఇలాంటివి 1100 పనులు గుర్తించి ప్రతిపాదించి మంజూరు చేసినట్లు తెలిపారు. “స్వర్ణ పంచాయితీలు” క్రింద ఇంటింటి సర్వే జరుగుతోందన్నారు.
3వ స్థాయి సంఘం వ్యవసాయానికి సంబంధించిన చర్చలో ఖరీఫ్ పూర్తయిందని, ధాన్యం సేకరణ జరుగుతోందని, రబీకి సంబంధించి ఈక్రాప్ నమోదు జరుగుతోందని అధికారులు తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణలో రైతుల సమస్యలు వారు పడుతున్న ఇబ్బందులు పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. తేమశాతం 21 శాతం ఉన్నప్పటికీ మద్దతు ధరలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ అమలు కావడం లేదని సభ్యులు తెలుపగా, ప్రభుత్వం నిబంధనల మేరకే జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోందని, ఇప్పటివరకు జిల్లాలో 3.50 లక్షల ఎం.టీ. ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో మిల్లర్లే కొనుగోలు చేస్తూ రైతులకు మద్దతు ధరలు రాకుండా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. రైస్ మిల్లుల తనిఖీలు ముమ్మరం చేయాలని చైర్పర్సన్ అధికారులకు సూచించారు. అనంతరం విద్యా వైద్యం అంశంపై 4వ, స్త్రీ సంక్షేమoపై 5వ, సాంఘిక సంక్షేమంపై 6వ, ఆర్థికం, పనులు 1, 7వ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు.
స్థాయి సంఘ సమావేశాల్లో ఆయా అంశాలకు సంబంధించిన జడ్పిటిసి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News