-ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నందు జెసి శుభం బన్సల్, జిల్లా అటవీ కన్జర్వేటర్ అధికారి సెల్వం, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. 2020 సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహించి ఉన్నారని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం జరగలేదని, ప్రస్తుత మన గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18,19 మరియు 20 తేదీలలో మూడు రోజులపాటు ఐదు ప్రాంతాలలో నేలపట్టు, బి.వి పాలెం, అటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఏలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులకు ఆదేశించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం నందు ఉన్న విలక్షణ, పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రేపెలికాన్ పక్షులు, కార్మోనెట్ బిల్ పక్షులు(నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలిపారు. వలస పక్షులు సౌత్ ఈస్ట్ ఆసియా సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంపొందించుకొని తిరిగి స్వంత ప్రాంతాలకి వెళ్తాయని, అలాగే ఫ్లెమింగో పక్షులు ఆహారం కొరకు వలస వచ్చి స్వంత ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతాయని అన్నారు. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకొనడానికి వీలుగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు విలక్షణ పెలికాన్ పక్షుల వీక్షణ, అటకానితిప్ప పులికాట్ పక్షుల రక్షిత కేంద్రం వీక్షణ పాయింట్ల నందు ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు తగినన్ని బైనాక్యులర్లు ఏర్పాటు చేశామని, బీవీపాలెం నందు 35 బోట్లు ఏర్పాటుతో లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ ల ఏర్పాటుతో బోటింగ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ లు ఎర్పాటు చేశామని, స్థానికంగా వున్న 50 మందిని గైడులుగా నియమిస్తున్నామని తెలిపారు. పర్యావరణ వైవిధ్య అంశాలపై ఎకో ఫ్రెండ్లీ బయో డైవర్సిటి అంశాలపై పలువురు నిష్ణాతులతో మేథో మథన సదస్సులు 3 రోజులు నిర్వహించి తద్వారా ఒక మంచి ప్రణాలిక తయారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పలు స్టాల్ లు ఏర్పాటుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సుమారు 200 రకాల పైగా పక్షులు వస్తాయని, అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ, శ్రీసిటీ తదితర ఇన్స్టిట్యూషన్ లు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమ నిర్వహణకి చర్యలు చేపడుతున్నామని అన్నారు. సీనియర్ అధికారులకు ఈ ఐదు ప్రాంతాలకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి ఇన్చార్జి అధికారిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆటకానితిప్ప పక్షుల రక్షిత కేంద్రానికి పిడి వెలుగు శోభన్ బాబు, బీవీ పాలెం బోటింగ్ ప్రాంతానికి ఇన్చార్జిగా డిడి మత్స్య శాఖ నాగరాజు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన వెన్యూ ఇన్చార్జిగా పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్, శ్రీసిటీ వెన్యూ నందు స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేంద్రన్ లకు విధులు కేటాయించడం జరిగిందని, మొత్తం కార్యక్రమానికి జెసి శుభం బన్సల్ నోడల్ అధికారిగా ఉంటారని, జిల్లా ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కన్వీనర్ లుగా ఉంటారని ఈ కార్యక్రమం జిల్లా టూరిజం కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారని అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. సదరు ఫ్లెమింగో ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని, స్థానిక ఆహార అలవాట్ల మేరకు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నాయని, సదరు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు వచ్చేవారు ప్లాస్టిక్ వాడకం లేకుండా పర్యావరణ హితమైన వాటిని వాడాలని, ఇక్కడికి వచ్చు పక్షులకు హాని జరగకుండా ఉండటానికి మనవంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. వ్యర్థాలను వేయుటకు సదరు ప్రాంతాల్లో చెత్త బుట్టలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీసిటీ నందు IIT, IISER, కల్నరీ ఇన్స్టిట్యూట్, మహిళా యూనివర్సిటీ తదితరాల నుండి ప్రముఖ విద్యావేత్తలతో పక్షులకు సంబందించిన పక్షి శాస్త్రవేత్తలను, పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేసి సిఎస్ ఆర్ కంక్లేవ్ ఏర్పాటు చేసి ఈ జీవ వైవిధ్య ఎకో సెన్సిటివ్ ప్రాంతాన్ని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వెట్ ల్యాండ్ సింపోజియం, టూరిజం కాంక్లేవ్, ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. షార్ వారికి ఒక స్టాల్ సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పలువురు నిష్ణాతులు సూచనలు సలహాలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ప్రాంతాలను సందర్శించి, కార్యక్రమాలను వీక్షించాలని సూచించారు. అనంతం జిల్లా అటవీ శాఖ కన్సర్వేటర్ అధికారి సెల్వం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అర్థవంతంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని, ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను అటవీ శాఖ, పర్యాటక శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించి రాబోవు తరం వారికి మార్గదర్శంగా ఉండేలా చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వెబ్సైట్ www.flamingofest.org. ను ప్రారంభించారు.
ఈ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ట్యాగ్ లైన్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ కల్చర్ అండ్ బయోడైవర్సిటీ అని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News