-విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల మూడవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రతాప్ సింహ శాస్త్రి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయాలన్నారు, దీని ద్వారా దేశం, సమాజం, కుటుంబాలు, మొదలైన వాటి గురించి వారికి అవగాహన వస్తుందన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా సంస్కృతి మూలాలు మరువకూడదని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలకు , ఆచార వ్యవహారాలకు భారతదేశం పుట్టినిల్లు అని.. అటువంటి వాతావరణానికి ఆచార వ్యవహారాల బోధనకు విద్యా భారతి పెద్దపీట వేస్తుందన్నారు.
మానసికంగా దృఢంగా ఉండాలి
ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా, దృఢంగా ఉన్నప్పుడే చక్కని విజయాలు సొంతమవుతాయన్నారు. విద్యార్థులు మానసిక సమస్యలతో సతమతం అవ్వకుండా అవసరమైన కౌన్సిలింగ్ తీసుకొని చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. చదువు ఆటపాటలతో పాటు శారీరక మానసిక దృఢత్వం కూడ చాలా అవసరం అని తెలిపారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పలు విభాగాల్లోని ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ అన్నపూర్ణ పాఠశాల వార్షిక నివేదిక, విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ చిగురుపాటి నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.