– సుంకర శ్రీనివాసరావు సేవలు ఆదర్శప్రాయం
– కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధైన సమాచార శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది సేవలు అత్యంత కీలకమని.. సుదీర్ఘకాలం పాటు సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డివిజనల్ పీఆర్‌వోగా పదవీ విరమణ చేసిన సుంకర శ్రీనివాసరావు అందించిన సేవలు నేటితరం అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
సమాచార, పౌర సంబంధాల శాఖ కృష్ణా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో డివిజనల్ పీఆర్‌వోగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన సుంకర శ్రీనివాసరావు దంపతులను శుక్రవారం జిల్లా కలెక్టర్ బాలాజీ కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించి వాటి ఫలాలు ప్రజలకు చేరువచేయడంలో సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది సేవలు ఎంతో కీలకమైనవన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల పర్యటనల సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని సమన్వయం చేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంలో నిరంతరం సమాచార శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో సమర్థవంతమైన సేవలు అందిస్తారన్నారు. అలాంటి శాఖలో 38 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలందించి ఉన్నతాధికారుల మన్ననలు పొందడంతో పాటు పనిచేసిన శాఖకు వన్నె తీసుకొచ్చిన సుంకర శ్రీనివాసరావు సేవలను నేటితరం అధికారులు, సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. అవకాశం ఉంటే భవిష్యత్తులో సుంకర శ్రీనివాసరావు సేవలను వినియోగించుకునేందుకు తనవంతు కృషిచేస్తామన్నారు. జిల్లాలో నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో సుంకర శ్రీనివాసరావు స్వచ్ఛందంగా వారి సేవలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. తొలుత జిల్లా కోర్డు సెంటర్‌లో గల విజయశ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించిన శ్రీనివాసరావు అభినందన వీడ్కోలు సభలో డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌వీ మోహనరావు, డివిజనల్ పీఆర్‌వోలు జి.రాజేష్, కె.రవి, ఏఈఐఈ జె.శ్రీనివాసరావు, ఏవీఎస్ వేమూరి ప్రసాద్, పబ్లిసిటీ అసిస్టెంట్ బి.బాలాజీ, సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొని సుంకర శ్రీనివాసరావు సేవలను కొనియాడి అభినందించారు.
Prajavartha Online Telugu News