– సీసీ కెమెరాలు, డ్రోన్లతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
– తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి
– మూడు షిఫ్టుల్లో సిబ్బందితో ప్రత్యేక కంట్రోల్ రూమ్
– భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు
– విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీసీపీ కేజీవీ సరిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేసి వందేళ్ల ఘన ఆధ్యాత్మిక చరిత్రగల గుణదల మేరీమాత ఉత్సవాలను విజయవంతం చేద్దామని, ఈ నెల 9, 10, 11 తేదీల్లో పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీసీపీ కేజీవీ సరిత అన్నారు.
శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గుణదల మేరీమాత ఉత్సవాలపై రెవెన్యూ, పోలీస్, విజయవాడ నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యం, ప్రజా రవాణా, విద్యుత్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌డీవో కె.చైతన్య మాట్లాడుతూ కీలక సమయంలో దాదాపు ఆరు లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా నాలుగు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో సమన్వయ శాఖల సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజా రవాణా శాఖకు సూచించారు. రామవరప్పాడు రింగ్, చుట్టుగుంట వైపు నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. వాహనదారులకు ఉపయోగపడేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడికక్కడ తాగునీటి పాయింట్లు ఏర్పాటుచేయాలని ఇందుకు వీఎంసీ చర్యలు తీసుకోవాలని, గతేడాది కంటే మరింత బాగా ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూద్దామని ఆర్‌డీవో చైతన్య అన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఏర్పాట్లు:
పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భద్రత పరంగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ కేజీవీ సరిత తెలిపారు. సీసీటీవీలు, డ్రోన్లతో సహా ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిన్నారుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా సమన్వయ శాఖల సహకారంతో మేరీమాత ఉత్సవాలను విజయవంతం చేసేందుకు పోలీసు శాఖ కృషిచేయనున్నట్లు సరిత తెలిపారు.
సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, సెంట్రల్ డివిజన్ ఏసీపీ కె.దామోదర్‌రావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, రెక్టార్ వై.జయరాజు, ఫాదర్ ప్రసాద్, ఫాదర్ బాలయేసు, ఫాదర్ గాబ్రియేల్, ఫాదర్ జాన్ పీటర్, మాచవరం సీఐ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News