విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2025-2026 ఆర్థిక బడ్జెట్‌లో పర్యాటకరంగానికి గణనీయమైన కేటాయింపులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ టూరిజం ఫోరమ్ ఛైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాని పేర్కొన్నారు. దేశంలో 50 పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడం, బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వైద్య పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆతిథ్య రంగానికి ఆర్థిక సాయం, వీసా మినహాయింపులు వంటి అనేక కీలక నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పవచ్చన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గణనీయమైన కేటాయింపులు జరిగాయన్నారు. రాబోయే కాలంలో అంతర్జాతీయంగా పర్యాటకేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రపుటల్లోకి ఎక్కనుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసేలా వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ రూపొందించారన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు.
Prajavartha Online Telugu News