-కేంద్ర ప్రభుత్వానికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సూచన
-లోక్ సభలో 377 కింద అంగన్వాడీ కేంద్రాలకు సౌర విద్యుత్ అంశం ప్రస్తావన
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు వుండగా వాటిలో 8,455 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం లేదు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం పరిధిని విస్తరించి అంగన్ వాడీ కేంద్రాలను ఆపథకం కిందకు తీసుకువస్తే అంగన్వాడీ కేంద్రాలకు నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుంది.
చిన్నారులకు ప్రాథమిక సౌకర్యాలు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలకమైన అంగన్వాడీ కేంద్రాలను పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో చేర్చాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రూల్ 377 ప్రకారం లోక్ సభ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.
వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు వుండటం వల్ల అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు. దీని ప్రభావం చిన్నారుల హాజరుపై పడటంతో పాటు, పిల్లలకు అవసరమైన సంరక్షణ సరిగ్గా అందటం లేదని పేర్కొన్నారు.
పిఎం సూర్య ఘర్ పథకం కిందకు అంగన్ వాడీ కేంద్రాలను తీసుకువస్తే నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా వుంటే పిల్లల పరిస్థితులను గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలిపారు.
అలాగే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం రూ.75,021 కోట్ల భారీ బడ్జెట్‌తో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వరకు అమలు చేయబడుతున్నది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు జిల్లా కలెక్టర్ తో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి సూర్య ఘర్ పథకం పై అవగాహన కల్పించాము. ఫలితంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి సూర్య ఘర్ పథకం కోసం దరఖాస్తుల సంఖ్య 60 వేలు మించి రావటం జరిగిందన్నారు. ఈ పథకం కింద 2025 నాటికి అన్ని ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ పథకం వినియోగం ద్వారా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు విద్యుత్ బిల్లుల వ్యయం తగ్గటంతోపాటు , విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోగలమని పేర్కొన్నారు..
అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లల సంరక్షణకి ఎలాంటి అంతరాయం లేని విద్యుత్ సరఫరా చాలా కీలకమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. పిఎం సూర్య ఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకంలోకి అంగన్ వాడీ కేంద్రాలను తీసుకువచ్చి పిల్లలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News