-బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా జే పూర్ణచంద్ర రావు
-“బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలకు బాటవేసే దిశగా కార్యాచణ, శిక్షణ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కులగణన చేసి, ఆ వివరాలు బయటకి వస్తే బీసీలు నిలదీస్తారనే భయంతో ఆ నివేదికను నాడు వైసీపీ తొక్కిపెట్టిందని, ఇప్పుడు తెదేపా అసలుకే మోసం చేస్తూ కులగణనపై నోరుమెదపట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు అన్నారు. గురువారం విజయవాడలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల బీసీ సమన్వయ కమిటీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం, శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ, నాడు వైసీపీ చేయించిన కులగణన రిపోర్టులో నిప్పులాంటి నిజాలు బయటకు వస్తే బీసీలకు జరిగిన అన్యాయాలు తెలుస్తాయాని, దానితో రెడ్డి ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడుతుందనే భయంతో వైసీపీ రిపోర్టు బయటపెట్టలేదు అని అన్నారు.
“ఇప్పుడు తెదేపా ఏకంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పక్కన తెలంగాణాలో కులగణన జరిగిపోవటం, రిపోర్టు బయటపెట్టడం, అందులోని తప్పులు, అసత్యాలపై గళమెత్తటం అన్నీ జరిగిపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నంగా ఉంది. అందుకే తెలంగాణ స్పూర్తితో కులగణన కోసం ఉద్యమం తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాము. భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావడానికి ఈ అవగాహనా, శిక్షణ సమావేశాలు నిర్వహిస్తున్నాము.”
ఈ సందర్భంగా కులగణన పై మాటమాట్లాడని మోడీ సర్కారు పై డా రావు విరుచుకుపడ్డారు. రెండు కులాలమధ్య నలిగిపోతున్న బీసీల బాగు, మనుగడకు రాజ్యాధికారం, రాజాకీయ ప్రతినిధ్యమే ముఖ్యమని, దీనికి కులగణన తప్పనిసరి అని అయన అన్నారు. పట్టుమని పది శాతం లేని కమ్మలు, రెడ్లు, గడచినా 16 ఎన్నికల్లో 1207 మంది అసెంబ్లీలో కూర్చుంటే, మరి వారి జనాభాకు సమానంగా ఉన్న యాదవులు, గౌడ్లు అతి తక్కువగా కేవలం 114 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. మొత్తం బీసీ ఎమ్మెల్యేలు 498 మాత్రమే. ఇవి కులగణన ద్వారా బయటకు వస్తాయని ఈ రెండుపార్టీలకు వెన్నులో వణుకు.
పైసా ఖర్చు లేని బీసీ సంరక్షణ చట్టం, స్థానికి సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, సమగ్ర కులగణన ఎందుకు చెయ్యరు. అటు అధికారం పంచరు, ఇటు మాకు పనికొచ్చే పనులు చేయరు. అందుకే బీసీలందరూ వారిని వారు బీసీలుగా చెప్పుకుంటూ, ప్రాంతీయ భేదాలు లేకుండా పోరాటాలకు సిద్ధం కావాలి.”
ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు అంగడాల పూర్ణచంద్ర రావు మరియు కన్వీనర్ బీసీ రమణ, పార్టీలకతీతంగా కులగణనపై పోరు జరగనున్నదని, ప్రతిఒక్కరిని కలుపుకుంటూ పోతూ, బీసీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయాలను ప్రశ్నిస్తూ సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News