-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లేకుండా హేతుబద్ధతతో కూడిన విధానంలో ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం కొవ్వూరు డివిజన్, మధ్యాహ్నం రాజమండ్రి విద్యా శాఖ సమీక్షలో భాగంగా మండల పాఠశాల విద్యా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (UDISE) డేటా, ఫిజికల్ వెరిఫికేషన్ డేటా ఆధారంగా విద్యార్థి వారీగా డేటా ను అనాలసిస్ చెయ్యాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు తీసుకోవడం లో గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలతో ఫౌండేషన్ స్కూల్స్ అనుసంధానం చేయడం వల్ల అప్ గ్రేడ్ చేయడం, తద్వారా అదనపు బోధన సిబ్బంది అందుబాటులోకి రావడం సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ పబ్లిక్ స్కూల్ ప్రతిపాదన అమలు చేయాలని, ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విద్యార్థులు సంఖ్య ఆధారంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఎం వి ఈ వో పాఠశాల సందర్శన చెయ్యాలని, ఎంపీడీవో , మండల ప్రత్యేక అధికారులు కూడా డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించి, స్కూల్ కు వచ్చేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యా అధికారి కే. వాసుదేవ రావు, ఎస్ ఎస్ ఏ పిడి ఎస్ సుభాషిణి, ఉదయం కొవ్వూరు, మధ్యాహ్నం రాజమండ్రి డివిజన్ కు చెందిన మండల స్పెషల్ ఆఫీసర్ లు, మండల పాఠశాల విద్యా అధికారులు, ఎంపీడీవో లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News