గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని సోమవారానికి సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ చాంబర్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా నివాసాలు, కమర్షియల్ సంస్థలు, బావులు, బోర్లు, ప్రస్తుతం ఇస్తున్న సరఫరా, వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన సరఫరా వంటి వివరాలతో సోమవారం నాటికి ఏఈల వారీగా సమగ్ర నివేదిక అందించాలని, నివేదిక మేరకు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, నగరంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. డిఈఈల వారీగా ఏఈలు, ఎమినిటి కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వాస్తవ అవసరాలకు తగిన విధంగా అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే గతంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాల వివరాలు, ఈ ఏడాది ఏర్పాటు చేయాల్సిన పాయింట్స్ వివరాలు, సచివాలయాల వారీగా పైప్ లైన్ లకు మరమత్తులు చేపట్టాల్సిన లిస్టు లు కూడా అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికీ త్రాగునీటి సరఫరా నూరు శాతం జరిగేలా చూడాల్సిన భాధ్యత ఏఈలదేనని, ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీస్ స్పష్టం చేశారు.
సమావేశంలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, డిఈఈలు నాగభూషణం, కళ్యాణరావు, మధుసూదన్, రమేష్ బాబు, సతీష్ కుమార్, శ్రీనివాస్, ఇంజనీరింగ్ సెక్షన్ సూపరిండెంట్ రాజశేఖర్, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News