-అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం పైపులు రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ లే అవుట్ లో కామన్ స్థలంగా వదిలిన 2,226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి. జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని గ్రామ సర్పంచిగా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జకరయ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని చెప్పారు. ఈ స్థలం విషయంలో స్థలాన్ని ఆక్రమించుకున్న రిటైర్డ్ అధికారికి మద్దతుగా నగరానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తనను బెదిరించారని వాపోయారు. వాస్తవానికి అది పంచాయితీ కి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మాణం కూడా చేసిందని అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు దిగటం అన్యాయం అన్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఎఫ్సీఐ ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లే అవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జకరయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు, అపార్ట్మెంట్లలో 3,500 వరకు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2,226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. అయితే, అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి. జకరయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమన్నారు. జకరయ్య ఆరోపిస్తున్నట్లు స్థలం ఆయనది కాదని ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయితీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోను కబ్జా కానియమని స్పష్టం చేశారు. ఆ స్థలంలో గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల సైతం రద్దు చేయాలని సబ్ కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని సంబంధిత ఆదేశిత పత్రాలను విలేకరులకు చూపారు. అయినప్పటికీ జకరయ్య 2024లో అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామస్తులకు ఆ స్థలంలో మంచినీటి ట్యాంకు రాకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రశ్నించిన తనపై పోలీసులు తన పై అక్రమ కేసులు నమోదు చేశారని, గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారని వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీని పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ నాయక్, కమిటీ నాయకులు వసంత్, చల్లగాని సునీల్, భాస్కరరావు, మోహన్ రావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని అన్నారు. గ్రామస్తులకు మద్దతుగా టిడిపి కృష్ణా జిల్లా నాయకులు గుజ్జర్లపల్లి బాబురావు, జి నరసయ్య, కోనేరు సందీప్ తదితరులు మాట్లాడారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామస్తులంతా కలిసి నగర పోలీస్ కమిషనర్ కు, విజయవాడ రూరల్ మండలం తహసిల్దార్ కు గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని కబ్జా కాకుండా రక్షించాలని వినతి పత్రాలు అందజేశారు.
Prajavartha Online Telugu News