మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల దే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
కృష్ణ- గుంటూరు పట్టభద్రులు నియోజవర్గం శాసనమండలికి ఈనెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, తహసిల్దార్లకు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డికె బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సక్రమంగా నిర్వహించడంలో సెక్టర్ అధికారులతో పాటు పోలింగ్, ఇతర అధికారులు సిబ్బందిది కీలకమన్నారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించే ఈ పోలింగ్ ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, మార్గదర్శకాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఈవీఎంల ఎన్నికకు, బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు వ్యత్యాసాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. ఏ స్థాయిలోనూ తప్పులు జరగరాదన్నారు. పోలింగ్ నిర్వహణకు జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 191 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగ రిజర్వ్ బాక్స్ లతో కలిపి 250 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ సక్రమంగా పంపిణీ జరిగే విధంగా మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, టెంపరరీ స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను పరిశీలించుకొని ముందుగానే సిద్ధం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి తీసుకున్న పోలింగ్ మెటీరియల్ చెక్ లిస్టును, బ్యాలెట్ బాక్సులు పోలింగ్ అనువుగా ఉన్నది లేనిది సరిచూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్లు సరైన పద్ధతిలో ఉండేలా చూసకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబరు వాటి కౌంటర్ పాయింట్ పై గల సీరియల్ నెంబర్లు చెక్ చేసుకోవటం తప్పనిసరి అన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లకు వేసే సీల్, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ చేస్తారని, ఏ స్థాయిలోనూ తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు పోలింగ్ నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లకు వేసే సీల్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లనుండి ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తీసుకోవటం, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను, మెటీరియల్ ను టెంపరరీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం తదితర అంశాలపై శిక్షణను ఇచ్చారు.
Prajavartha Online Telugu News