-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . కార్యక్రమంలో తొలుత దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి తరానికి నిజమైన ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య అని, వారి కలల సాఫల్యానికి, నిరంతరం వారి ఆశయాల సాధన దిశగా అడుగు వేద్దామన్నారు. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మారు పేరైన దామోదరం సంజీవయ్య ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులని కొనియాడారు. రాష్ట్ర ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య అని, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో కార్మికశాఖ, విద్యాశాఖలో పలు సంస్కరణలు రూపొందించారని, ఆయన చేసిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. బోనస్ చట్టాన్ని (ఆర్డినెన్స్) ప్రవేశపెట్టి కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని అన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు. నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో సిహెచ్. కన్నమ్మ నాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డిడి షేక్ షాహిద్ బాబు, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ సాల్మన్ రాజు, కలెక్టరేట్ ఏవో సిహెచ్. వీరాంజనేయ ప్రసాద్,సెక్షన్ సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News