-స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
-స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్‌ను విజయవంతం చేయాలి
-ఈ వారం సోర్స్ – రిసోర్స్ ఇతివృత్తంతో కార్యక్రమాల నిర్వహణ
-అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా అమలుచేస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. ప్రతినెలా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌గా గుర్తించినందున, గత నెలలో మాదిరి ఈసారి కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 15వ తేదీ మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జిల్లాస్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతినెలా ఒక ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని.. ఈనెల కూడా సోర్స్ – రిసోర్స్ ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నియమ నిబంధనలు అనుసరించి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సర్క్యులర్ ఎకానమీలో కీలకమైన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలపైనా అవగాహన కల్పించాలన్నారు. తడి చెత్త-పొడి చెత్త, హజార్డస్ వ్యర్థాలను వేర్వేరు బిన్స్‌లో వేసి, అందించే మంచి అలవాటును ప్రోత్సహించడం వంటివి చేయాలన్నారు. కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కూడా చేయించాలని సూచించారు. కార్యక్రమం వివరాలను స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. కార్యాలయాల్లోనూ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గత నెలలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా ముందంజలో నిలిచిందని.. ఈ నెలలో కూడా అదే స్ఫూర్తితో కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News