– 35 గ్రామాల పరిధిలో కట్టుదిట్టమైన బయో సెక్యూరిటీ కీలకం
– 24X7 పాటు పర్యవేక్షణ, విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టిండి
– జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంపలగూడెం మండలంలోని అనుమల్లంకలో కోళ్ల మరణాలకు సంబంధించి బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పది కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని, సమన్వయ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో చేపడుతున్న నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బోఫాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిహ్షాద్) నుంచి ఫిబ్రవరి 14న వచ్చిన ఫలితాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు. అప్పటికే యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన కేంద్రం (0-1 కి.మీ.)తో పాటు అనుమల్లంకకు పది కిలోమీటర్ల పరిధిలోని బఫర్ జోన్‌లో నియంత్రణ చర్యలను పకడ్బందీగా కొనసాగించాలన్నారు. బఫర్ జోన్‌లో చికెన్, గుడ్ల దుకాణాలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని.. శానిటైజేషన్‌కు స్ప్రేయర్లు, ఫాగర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని 116 కోళ్లఫారాల్లోనూ 24X7 నిరంతర పర్యవేక్షణతో పాటు బయో సెక్యూరిటీ చర్యలను చేపట్టాలన్నారు. ప్రతి చర్యలోనూ నిర్దిష్ట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అనుసరించాలన్నారు. బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బఫర్ జోన్‌లో ఫీవర్ సర్వేలను నిర్వహించాలని, అవసరమైతే నమూనాలను పరీక్షించాలని.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో పక్షుల్లో అసహజ మరణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని అటవీ అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News