-పాలసీలో తప్పులు ఉంటే సరిదిద్దండి….అమలులో అలసత్వం ఉంటే బాధ్యులపై చర్యలు
-ప్రజలే ఫస్ట్ అనే విధానం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలి
-పథకాల అమలుపై జిల్లాల వారీగా కూడా రేటింగ్
-ప్రజలు, లబ్దిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ…వారానికి నాలుగు శాఖలపై సమీక్ష
-పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్షలో అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని….దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవ్వాలని సిఎం అన్నారు. ఏదైనా పాలసీలోనో, అమలులోనో లోపాలు, తప్పులు ఉంటే సరిదిద్దాలని…అయితే వాటి అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. ఆయా శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరు బాగుంటేనే అన్ని కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని…అప్పుడే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని సిఎం అన్నారు.
మెక్కుబడి పనితీరుతో మార్పు రాదు
అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని…వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సిఎం అన్నారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని…గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా…మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని సిఎం సూచించారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని….సాధ్యమైనంత ఎక్కువ టెక్నాలజీ వాడాలని సిఎం సూచించారు. శాఖల పనితీరుపై నిరంతరంగా సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తామని సిఎం అన్నారు. ప్రజలిచ్చే రేటింగ్ పై వారానికి నాలుగు విభాగాలపై సమీక్ష చేస్తున్న సిఎం….ఈ రోజు దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసి సర్వీసులు, చెత్త నుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజా స్పందనపై సమీక్ష నిర్వహించారు. ఈ విభాగాల్లో లబ్ధిదారులు, ప్రజల నుంచి ఐవిఆర్ఎస్ ద్వారా, క్యూర్ కోడ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని… ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్ బ్యాక్ ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సిఎం అన్నారు.
దీపం పథకం
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడా ఫిర్యాదులు రావడంపై సిఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే…వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని సిఎం సూచించారు. సిలిండర్ల డెలివరీలో ఫిర్యాదులు వస్తే…ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బు అకౌంట్ లో జమ అయ్యిందా లేదా అనే విషయంలో ప్రజల నుంచి సమాచారం సేకరించగా… 48 గంటల్లో డబ్బు జమ అవ్వడం లేదు అని కొంత మంది ఫిర్యాదు చేశారు. దీనికి కారణాలు విశ్లేషించి…సాంకేతికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిఎం ఆదేశించారు.
ఆర్టీసీ సర్వీసులు
ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి సదరు బస్సు సమయానికి బయలుదేరిందా…నిర్థేసించిన సమయానికి గమ్యానికి తీసుకువెళ్లారా..బస్ స్టాండ్ లో సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ పై చర్చించారు. ఆర్టిసి బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూ ఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని సిఎం తెలిపారు. బస్ స్టాండ్ లలో మౌళిక సదుపాయాలపై (తాగునీరు, టాయిలెట్లు, కుర్చీలు) ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక చెప్పగా…దాన్ని సరిదిద్దాలని సిఎం సూచించారు. ఇప్పటికి 1100 బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ పెట్టామని అధికారులు చెప్పగా….మొత్తం 11 వేల బస్సులతో పాటు బస్ స్టాప్ లు, బస్ స్టేషన్ లలో కూడా విరివిగా క్యూర్ ఆర్ కోడ్ ఉంచి…ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే బస్ స్టాండ్ లలో ఉండే క్యాంటీన్ లలో ఆహారం, ధరలు వంటి వాటిపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని…తద్వారా నాణ్యమైన సేవలు అందేలా చూడవచ్చని సిఎం అన్నారు.
Prajavartha Online Telugu News