మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శనివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు వారి సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఆక్వారైతులకు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎం – ఎం కె ఎస్ ఎస్ వై) పథకం వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్, ఈ-శ్రమ్ వంటి పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, తద్వారా అర్హులైన వారు పథకాలలోని ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉందన్నారు. 2025 మార్చి 31కి ఆర్థిక సంవత్సరంతో పథకం ముగిసే అవకాశం ఉండటంతో ఆ లోపుగా గ్రామ మత్స్య సహాయకుల సహకారంతో లబ్ధిదారులను గుర్తించి పోర్టల్ లో పేర్లను నమోదు చేయించి పథకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు టెక్నికల్ కన్సల్టెంట్ సాల్మా, మత్స శాఖ జిల్లా అధికారి నాగబాబు, మెప్మా పీడీ సాయిబాబు, మత్స్య అభివృద్ధి అధికారులు, ఏడీలు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News