-విద్య, వైధ్యం, వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత
-ఎస్సీ, ఎస్టీ, బీసీ,మహిళల అభివృద్ధికి పెద్దపీట
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రగతి పధంలో పయనించేందుకు రాష్ట్ర బడ్జెట్ దోహదపడుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన శాఖకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని జాతీయ గ్రామీణ జీవనోపాదుల పథకం( యన్ ఆర్ యల్ యం)కు గత ఏడాది బడ్జెట్లో రూ|| 325 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో ఇదే పథకానికి రూ|| 790 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, గ్రామీణ పేదల జీవనోపాదుల అభివృద్ధికి ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. యన్ ఆర్ యల్ యం స్కీంకు అధిక మొత్తంలో కేటాయించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవిష్కరణలు, పెట్టుబడి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒకే చోట అన్ని వసతులు కల్పించి సూక్ష్మ పెట్టుబడులను అభివృద్ధి పరచవచ్చని తెలిపారు. ఇదేవిధంగా రైతు ఉత్పత్తిదారుల అభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలు, గ్రామీణ పేదల జీవన ప్రమాణాల పెంపు కోసం నూతన ఆవిష్కరణల అభివృద్ధి చేయవచ్చని, ఓపెన్ నెట్వర్క్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫాం ను అభివృద్ధి పరిచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు అధిక ధర లభించే విధంగా దోహదం చేస్తుందన్ ఆయన తెలిపారు. స్వయం సహాయ సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తి సంస్థల సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పి పి పి)తో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం వరకు వయాబులిటీ గ్యాప్ పండింగ్ కోసం ఓ వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా రూ|| 2000 కోట్ల కార్పస్ ఫండ్ ను ప్రతిపాదించడం శుభ సూచకమని తెలియజేశారు. ఇదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో సూక్ష్మ, చిన్న, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చారని తెలిపారు. మొట్టమొదటి సారిగా తెలుగు భాషాభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా తెలుగు భాష, సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు దోహదపడతాయని ఆయన తెలియజేశారు. నైపుణ్య అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు “ఆదరణ” పథకాన్ని పునరుద్దరించటం ద్వారా వివిధ వృత్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్న బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీలు, ఎస్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిదులిచ్చి గతంలో మూతబడిన సంక్షేమ పథకాలను పునరుద్దరించారని అన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలు, ఐటిడిఏల అభివృద్ధికి అత్యధికంగా నిధులు ఇవ్వడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేశారని ఆయన తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు రూ|| 1028 కోట్ల నిధులు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నైపుణ్యాన్ని అభివృద్ధిని పెంపొందించి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, ప్రాథమిక, ఉన్నత విద్యారంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారని తెలిపారు. రాబోయే విధ్యా సంవత్సరంలో “తల్లికి వందనం” పథకాన్ని ప్రారంభించడం ద్వారా చదువుకుంటున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి రూ|| 15వేల వంతున వారి తల్లిదండ్రులకు నిధులు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో విధ్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ|| 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, సామాన్య పేదల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహాదం చేసే అమరావతి, పోలవరం నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో తోదపడుతుందని మంత్రి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ లో ప్రధానంగా స్వయం సహాయ సంఘాల మహిళల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల కార్యకలాపాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక,రాజాకీయ కార్యకలాపాలను ప్రభావితం చేసేంతగా డ్వాక్రా సంఘాలు అభివృద్ధి చెందాయని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రస్తావించడం “డ్వాక్రా” మహిళ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తుందని మంత్రి శ్రీనివాస్ ఈ ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News