-క్రీడలతో మహిళల్లో మరింత మానసిక చైతన్యం…
-క్రీడలపై ఆసక్తి పెరగడం శుభ పరిణామం…
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దైనందిన జీవితంలో ప్రతి ఒక్క మహిళ క్రీడల పట్ల ఆసక్తి చూపడం సమాజంలో ఆరోగ్య అవగాహన పట్ల వస్తున్న మార్పునకు శుభ పరిణామమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం జరిగిన క్రీడాంశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిరోజు కార్యాలయాలలో ఎంతో ఒత్తిడితో సేవలు అందిస్తున్న మహిళలకు ఇటువంటి కార్యక్రమాలు
ఆటవిడుపుగా ఉంటాయన్నారు. ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు వ్యాయామం వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. ఇటువంటి అలవాట్లు మహిళల చర్యలు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. జిల్లాలో మహిళా ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు పరిష్కరిస్తున్నామని వివరించారు. ఉద్యోగుల మహిళా ఉద్యోగులు తాము పనిచేస్తున్న కార్యాలయాలలో రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఏ కార్యాలయంలో నైనాసరే మహిళలకు ఎటువంటి సమస్య వచ్చినా…ఏ సమయంలోనైనా సరే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నాయని, జిల్లాలో ఆయా చట్టాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, అంత్యాక్షరి పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐఎస్ జి ఈ ఎఫ్ మహిళా కమిటీ కన్వీనర్ ఎం. రాజలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. జానకి, రాష్ట్ర కార్యదర్శి బి. తులసి రత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లలితాంబ, శాంతిశ్రీ, శివలీల, విజయ శ్రీ, మల్లీశ్వరి, సురేఖ, సరస్వతి తదితరులతోపాటు క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News