– కార్యాలయ సిబ్బందితో పాటు సందర్శకులకు తగిన ఏర్పాట్లు చేయాలి
– వడదెబ్బపై క్షేత్రస్థాయిలో ఇప్పటినుంచే అవగాహన కల్పించాలి
– గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ చలివేంద్రాలు పెట్టాలి
– క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, మజ్జిగను కూడా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
వేసవి కార్యాచరణపై క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్ నుంచి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో పాటు సందర్శకులకు వేసవి కార్యాచరణలో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వడదెబ్బ తగిలే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఈ విషయమై ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. చలివేంద్రాల కార్యకలాపాలను నిరంతరం సమీక్షించాలని, ఒక్క మనుషులకే కాదు.. పశుపక్ష్యాదులకూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితరాల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటినుంచే గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News