అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెలా మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ఇతర ప్రాంతాలన్నిటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు.స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు,శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతి నెలా మూడవ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి,ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించి ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈనెల 15వ తేదీన నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వైబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని చెప్పారు.విజన్ 2047 కింద పరిశుభ్ర,ఆరోగ్య,హరిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిద్దేందుకు తగిన ప్రణాళికలను రూపొందించడం జరిగిందని వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు మరీ ముఖ్యంగా ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం తోపాటు వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాస్లు,కప్పులు,ప్లేట్లు,క్యారీ బ్యాగులు వంటివి తయారీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.ఇందుకు గాను చేనేత జౌళి శాఖ తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంఎస్ఎఇ,ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ల ద్వారా వాటిని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.ప్లాస్టిక్ వస్తువుల నిషేధంలో భాగంగా వాటిని తయారు చేసే పరిశ్రమలు,సంస్థల స్థాయిలోనే వాటి ఉత్పత్తి జరగకుండా వాణిజ్య పన్నులు,పరిశ్రమల శాఖలు దృష్టి సారించాలని సిఎస్ విజయానంద్ చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరిస్తూ స్వచ్ఛాంధ్ర అనేది స్వర్ణాంధ్ర విజన్ 2047 కు 9వ పిల్లరని పేర్కొన్నారు.దీనిలో భాగంగా గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని గృహాలన్నిటిలోను ప్రతి ప్రాంతంలోను పరిశుభ్రతను పాటించడం,వ్యర్ధాల నిర్వహణ,రీసైక్లింగ్ కు సంబంధించి ఉత్తమ విధానాలను అవలంభించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు.స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర(SASA)కు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక రోడ్డు మ్యాప్ రూపొందించి గత జవనరి 17న జిఓ ఆర్టి సంఖ్య 24 ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వివరించారు.ఈకార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖలోను,జిల్లా స్థాయిలోను నోడలు అధికారులను నియమించుకోవాలని చెప్పారు.అంతేగాక ఈకార్యక్రమాల పర్యవేక్షణకు కార్యదర్శి,జిల్లా స్థాయిలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించా లన్నారు.అదే విధంగా ఈవెంట్ రోజు కార్యక్రమాల వివరాలను సాసా(SASA)యాప్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని చెప్పారు.స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమంపై జిల్లా కలక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సురేశ్ కుమార్ సూచించారు.
స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు కొన్ని శాఖల వారీ ఈవెంట్ డే కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వివరించారు.మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి మెగా అర్బన్ క్లీన్ అప్ డ్రైవ్ కింద వివిధ నగరాలు,పట్టణాల్లో వీధులు,పార్కులు, మార్కెట్ల పరిశుభ్రం చేయడం,స్వచ్చ వార్డు చాలెంజ్,ప్లాస్టిక్ ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్,డ్రైన్ల క్లీనింగ్,డీసిల్టింగ్ క్యాంపెయిన్,బ్యూటిఫి కేషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్,గ్రార్బేజి ఫ్రీ సిటీస్ క్యాంపెయిన్,పబ్లిక్ టాయిలెట్ మెయిన్టెన్స్ డ్రైవ్, స్ట్రీట్ వెండర్ హైజీన్ అవగాహన,వేస్టు టు వెల్తు ఎగ్జిబిషన్,స్వచ్ఛ అపార్టుమెంట్ మరియు గేటెడ్ కమ్యునిటీ కాంటెస్ట్,లేక్ మరియు కెనాల్ క్లీనప్ డ్రైవ్ వంటి కార్యక్రమాలను రూపొందించి నట్టు తెలిపారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి స్వచ్ఛ గ్రామ సభ,రూరల్ క్లీన్లినెస్ డ్రైవ్,మోడల్ స్వచ్ఛ విలేజ్ అవార్డు,సాలిడ్,లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ అవగాహన,కమ్యునిటీ టాయిలెట్ నిర్వహణ డ్రైవ్,విలేజ్ వాటర్ బాడీ క్లీన్ అప్ డ్రైవ్,రూరల్ డ్రైనేజి సిస్టమ్ మెయిటెనన్స్,హౌస్ హోల్డు వేస్ట్ సెగ్రిగేషన్ ట్రైనింగ్,ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ ప్లస్ అవగాహన,క్లీన్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవగాహన,స్వయం సహాయక సంఘాలతో స్వచ్ఛతా క్యాంపెయిన్ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.పర్యాటక శాఖకు సంబంధించి హెరిటేజ్ సైట్ క్లీనింగ్ డ్రైవ్,ప్లాస్టిక్ ప్రీ టూరిస్ట్ జోన్,పవిత్ర స్థలాలు,పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఫ్రీ ఫిలిగ్రిమేజ్ క్యాంపెయిన్,హోలీ వాటర్ క్లీనప్,క్లాత్ బ్యాగులు పంపిణీ,గ్రీన్ టెంపుల్ ఇనీషియేటివ్,పరిశ్రమలు,వాణిజ్య ప్రాంతాల్లో ఉత్తమ స్వచ్ఛ ఇండస్ట్రీ,షాపు అవార్డులు,ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజిమెంట్ వర్కు షాపులు,జీరో వేస్టు ఆఫీస్ చాలెంజ్,ఎనర్జీ మరియు వాటర్ కన్జర్వేషన్ అవగాహన,గ్రీన్ బెల్టు డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
అంతేగాక అన్ని శాఖలు అందరూ ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పబ్లిక్ ప్రాంతాల్లోమాస్ క్లీన్లినెస్ డ్రైవ్,ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్,వేస్టు సెగ్రిగేషన్ వర్కు షాపులు,కమ్యునిటీ కంపోజిటింగ్,స్వచ్ఛ ప్లెడ్జి సెరిమనీలు,స్వచ్ఛాంధ్ర మారతాన్,ప్లాస్టిక్ కలక్షన్ క్యాంపెయిన్,బీచ్ క్లీనప్ డ్రైవ్ లు,గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సరస్సులు,నదులు, చెరువులు,కాలువల వెంబడి వేస్టు బాడీ రెస్టోరేషన్ కార్యక్రమాలు,మానవహారాల నిర్వహణ వంటి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుందని సురేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ రెడ్డి, డైరెక్టర్ మున్సిపల్ పరిపాలన శాఖ జి.సంపత్ కుమార్,న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి దశరథరామి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి కృష్ణబాబు,సియం కార్యదర్శి ప్రద్యుమ్న ఇంకా వివిధ శాఖల కార్యదర్శులు,శాఖాధిపతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News