-చంద్రబాబు దార్శనికతతోనే స్వయం సహాయక సంఘాల వృద్ధి
-ఎన్టీఆర్ మహిళలకు కల్పించిన ఆస్తి, రాజకీయ హక్కులతో విప్లవాత్మక మార్పులు
-మహిళా దినోత్సవం సందర్భంగా ఆటోలు, కుట్టు మిషన్లు పంపిణీ
-పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నింటా సగం… అభివృద్ధిలో సగం అన్నట్లు దూసుకు పోతున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించిన మంత్రి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వ్యాపారాలు జరుగుతున్న తీరు… లాభ, నష్టాల వ్యవహారాలను వారిని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మహిళలందరికీ మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దార్శనిక ఆలోచనలతో ఎంతోమంది మహిళలు స్వయం సహాయక సంఘాల చేయూతతో ఆర్థిక వృద్ధి సాధించారని గుర్తు చేశారు. ఎస్ హెచ్ జీల విషయంలో గతంలో కొంతమంది హేళనగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.., నేడు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎదగడం మహిళలు అందరికీ గర్వ కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన మహిళలపై దాడులు, పని దోపిడీ, వారి త్యాగాలకు గుర్తుగా 110 సంవత్సరాల క్రితం డెన్కార్క్ లో ప్రారంభించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.., నేటి తరం మహిళల్లోనూ స్పూర్తిని నింపుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మహిళలకు హక్కులను కల్పిస్తే… మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అధికారం కల్పించడం ద్వారా ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి ప్రస్థానంలో తనదైన ముద్ర వేసిందన్నారు. పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడాలని భావిస్తున్న నేటితరం మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో… మగవారితో సమానంగా సంపాదిస్తూ తాము కూడా దేనిలోనూ తక్కువ కాదని నిరూపించారని ప్రశంసించారు. బాల్య వివాహాలను, అత్యాచారాలు, దాడులను ఎదుర్కొంటూ వారు ఎదుగుతున్న తీరు అభినందనీయమన్నారు.
ఆటోలు, కుట్టు మిషన్లతో ఆర్థిక చేయూత సాధించాలి…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాకు చెందిన పలువురు మహిళలకు మంత్రి గొట్టిపాటి ఎలక్ట్రిక్ ఆటోలు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక చేయూత కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆటోలు, కుట్టు మిషన్లతో ఆర్థిక చేయూత సాధించాలని లబ్ధిదారులను మంత్రి ప్రోత్సహించారు. అదే విధంగా విస్తరాకుల పరిశ్రమలు వంటివి గ్రామాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తే అనేక కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. ఆ దిశగా ఆలోచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలు, ఇతర కార్యక్రమాలు జరిగేప్పుడు మహిళలు నిర్వహించే పరిశ్రమల నుంచే కొనుగోళ్లు జరిగేలా తాము ప్రోత్సహిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తితో పాటు పలువురు అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News