– శరత్స్ ఇనిస్టిట్యూట్ అరుదైన ఘనత
– మొదటిసారి తల్లి, రెండోసారి భర్త.. ఇప్పుడు తండ్రి
– మహిళకు మూడుసార్లు కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు
– సంక్లిష్టతలను అధిగమించి విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. శరత్ బాబు
– చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయిన మహిళ
– శరత్స్ ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక 24×7 హీమో డయాలసిస్ యూనిట్
– డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే మహిళకు మూడోసారి కిడ్నీ మార్పిడి అవసరం కాగా.. ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. శరత్ బాబు నేతృత్వంలోని వైద్య నిపుణులు అన్ని సంక్లిష్టతలను అధిగమించి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత అరుదైన ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యారావుపేటలోని శరత్స్ ఇనిస్టిట్యూట్ నందు జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ.. “నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వయసు మహిళకు ఇటీవల కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం. గతంలో ఈ మహిళకు రెండు పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగింది. మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. పేషెంటుకు మూడుసార్లు కూడా ఆమె కుటుంబసభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా.. ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారు” అని అన్నారు. ఒకే వ్యక్తికి మూడోసారి కిడ్నీ మార్పిడి చేయడం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవచ్చు. శరత్స్ ఇనిస్టిట్యూట్ నందు ఇప్పటి వరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం. అత్యాధునిక 24×7 హీమో డయాలసిస్ యూనిట్ ద్వారా నెలకు 2000 డయాలసిస్ చికిత్సలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు అందిస్తున్నాం. కిడ్నీ మార్పిడి చికిత్స అనంతరం కోలుకుంటున్న పేషెంటును ఈరోజు డిశ్చార్జి చేస్తున్నాం” అని డాక్టర్ జి. శరత్ బాబు వివరించారు.
కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని కోలుకున్న పేషెంట్ మాట్లాడుతూ.. తనకు కిడ్నీలను దానమిచ్చిన తన కుటుంబసభ్యులకు, కిడ్నీ మార్పిడి చేసి తన ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడోసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న తనకు డాక్టర్ శరత్ బాబు అద్భుత వైద్యం అందించడమే కాకుండా, అవసరమైన మనోధైర్యాన్ని కూడా ఇచ్చారని అన్నారు.
ఈ సమావేశంలో శరత్స్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ జి. వెంకట్రావు, డాక్టర్ జి. ప్రశాంతి, డాక్టర్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News