Breaking News

ర‌క్షిత మంచినీటి ట్యాంకుల ప‌రిశుభ్ర‌తకు అత్యంత ప్రాధాన్య‌మివ్వండి

– ఎప్ప‌టిక‌ప్పుడు నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లూ నిర్వ‌హించాలి
– ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య త‌లెత్త‌కూడ‌దు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య అనేది ఉండ‌కూడ‌ద‌ని.. ర‌క్షిత తాగునీటి ప‌థ‌కాల ట్యాంకుల ప‌రిశుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ నందిగామ నియోజకవర్గంలో క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేశారు. గ్రామాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ల‌క్ష్యంగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. తొలుత నందిగామ మండలం, అంబారుపేట గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ట్యాంకును పరిశీలించారు. ట్యాంకుల‌ను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ప్రశ్నించారు. ప్ర‌జారోగ్య భ‌ద్ర‌త‌తో ముడిప‌డియున్నందున త‌ప్ప‌నిస‌రిగా ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేయాల‌న్నారు. గ్రామంలోని బోరును ప‌రిశీలించి, నీటిని తాగి ప‌రిశీలించారు. అనంతరం మండ‌లంలోని అడవిరావులపాడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం ట్యాంకులను పరిశీలించారు. నీటి వ‌న‌రుల‌కు సంబంధించి ఫ్ల‌షింగ్ లేదా పూడిక‌తీత‌, బోరుబావులు, ఇత‌ర బావులను లోతు చేయ‌డం వంటి ప‌నులు ఇంకా ఏవైనా పెండింగ్ ఉంటే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేసి, నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లూ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. నీటి ఎద్ద‌డి ఉన్న ఆవాసాలకు ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేయాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.
అనాసాగ‌రం రైతుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి:
నందిగామ పురపాలక సంఘం శివారు అనాసాగరం గ్రామ రైతులు.. క‌లెక్ట‌ర్‌ను క‌లిసి వ‌రి పంట‌కు సాగునీటి విడుద‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. నవాబుపేట చెరువు కింద తమ గ్రామానికి చెందిన సుమారు 150 ఎకరాల్లో వరి పంట వేశామని, ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉండగా చెరువు నుండి నీళ్లు వదలడం లేదని తెలిపారు. కాకుల పొన్నవరం నుంచి శ‌నగపాడు స‌ప్ల‌య్ ఛాన‌ల్ ద్వారా స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డం, మునేరులో చుక్క‌నీరు లేక‌పోవ‌డం త‌దిత‌రాల వ‌ల్ల మ‌రో 400 ఎక‌రాల‌కు నీటి స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని వివ‌రించారు. స్పందించిన కలెక్టర్.. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి అనాసాగరం గ్రామ రైతుల స‌మ‌స్య‌ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.
క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వెంట నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ విద్యాసాగ‌ర్‌, నందిగామ త‌హ‌సీల్దార్ ఎన్‌.సురేష్‌, ఎంపీడీవో శ్రీనివాస‌రావు, స్థానిక అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *