-ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
వలందపాలెం/మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగరం 3వ డివిజన్ వలందపాలెంలోని జామియా మసీదులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు సర్వ మానవాళికి రక్షణ కలిగిస్తాయని అన్నారు. ముస్లిం మత పెద్దల విన్నపం మేరకు మచిలీపట్నంలోని జామియా మసీదు అభివృద్ధితో పాటు వారు వ్యాపారం చేసుకునేందుకు షాపులకు అనుమతుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాస్థాయిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, ముస్లిం సోదరులందరూ రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇమామ్ మహమ్మద్ ఇక్రముల్లా, మూడో డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ సిద్ధిక్, పార్టీ ఇంచార్జ్ చిన్నం సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News