గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా జిఎంసి చేపట్టిన 120 అడుగుల రోడ్ విస్తరణలో ప్రభావితమయ్యే భవనాలకు నష్ట పరిహారం, స్తలాలకు టిడిఆర్ బాండ్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిస్తామని, ఎన్నో ఏళ్ల గుంటూరు నగరవాసుల కల అయిన ఆర్ఓబి నిర్మాణంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం వలన ప్రభావితమయ్యే భవనాల యజమానుల్లో కోర్ట్ ని ఆశ్రయించిన చేసిన వారితో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ విస్తరణ పనులు ప్రారంభించామని, ఇప్పటికే ప్రభావిత భవనాల్లో 36 మంది అంగీకార పత్రాలు అందించారన్నారు. మరి కొందరు కోర్ట్ లను ఆశ్రయించారని, వారందరూ ఆర్ఓబి నిర్మాణంకు వ్యతిరేకం కాదని, కేవలం నష్ట పరిహారం అంశంపై కోర్ట్ కి వెళ్లడం జరిగిందన్నారు. ఆర్ఓబి నిర్మాణ టెండర్లు ఈ నెలాఖరు నాటికి ఫైనల్ అవ్వడం, ఏప్రిల్ 15 తర్వాత పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. రోడ్ విస్తరణ జరిగే ప్రాంతాల్లో పట్టణాల్లో స్ట్రక్చరల్ నష్ట పరిహారం (భవన నిర్మాణ వయస్సుని అనుసరించి), స్థలాలకు టిడిఆర్ బాండ్లు అందించడం జరుగుతుందన్నారు. మరో విధానంలో భూ సేకరణ ద్వారా కూడా విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నగర పరిసరాల్లో మార్కెట్ విలువపై 2 రెట్లు నష్ట పరిహారం ఇవ్వబడునని, అదే చర్చల ద్వారా అంగీకార పత్రం ఇచ్చినచొ కోల్పోతున్న భూమికి 4 రెట్లు విలువైన టిడిఆర్ బాండ్లు ఇవ్వబడునని తెలిపారు. విస్తరణ పనులు పారదర్శకంగా చట్ట ప్రకారం, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జరుగుతాయని, ఇందులో ఏ అపోహలకు తావు లేదన్నారు. విస్తరణ ప్రభావిత భవన యజమానులు ఏ అనుమానం ఉన్నా లేదా సమస్య ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఏసిపిలు రెహ్మాన్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, ఈఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News