మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేయుచున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఈనెల 30వ తేదీన జరిగే ఉగాది ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తో కలిసి పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను (ఏ ఎస్ ఎల్) పరిశీలించారు.
తొలుత వారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం, అనంతరం విజ్ఞాన వికాస కేంద్రంలో గ్రాఫిక్ డిజైన్ మల్టీమీడియా ల్యాబ్ ను, తదుపరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ సెంటర్లో భవనం ప్రాంగణంలో ఉన్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహం, అనంతరం అక్కడి ప్లంబింగ్ శానిటరీ ల్యాబ్, సోలార్ ఎనర్జీ ట్రైనింగ్ సెంటర్, రెండవ అంతస్తులోని ఫార్మాసూటికల్ స్కిల్ సెంటర్ లను పరిశీలించారు. తదనంతరం ప్రజా మందిరం, ఆడిటోరియంలో వేదిక, సీటింగ్, మైకు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
తదుపరి జిల్లా కలెక్టర్ ప్రజా మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం అంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పద్ధతి ప్రకారం పక్కాగా చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రతి ప్రాంతంలో ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలన్నారు. కార్యక్రమానికి ఎలాటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక యంత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ యాజమాన్యంతో సమన్వయం చేసుకొని అంతర్జాలం అనుసంధానం చేసుకోవాలని కనెక్షన్ వేగవంతంగా ఉందా లేదా పరీక్షించాలన్నారు. ప్రత్యక్ష ప్రసారం, మైక్ సిస్టం ఏర్పాటు సజావుగా ఉండేలా చూడాలన్నారు. ప్రజా మందిరంలో వేదిక పైన, క్రింది భాగాన సీటింగ్ ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రముఖులు, అధికారులకు వాహనాల పార్కింగ్ ఏర్పాటు సజావుగా చేయాలన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి బయలుదేరి జాతీయ రహదారిలో విజయవాడకు వెళతారని, దారిలో అన్ని విద్యుత్ దీపాలు వెలిగేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఒక అంబులెన్స్ను ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, సంయుక్త కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ సత్యనారాయణ,ఎస్ హెచ్ జి అదనపు ఎస్పి శ్రీనివాసు, డిఎస్పి చంద్రశేఖర్, గుడివాడ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారి యేసు రత్నం, ఏపీఎంఐపై పీడీ విజయలక్ష్మి, ఎస్ బి సి ఐ వి శ్రీనివాసరావు, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇన్చార్జి పరదేశి, ఎంపీడీవో జోగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News