మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పామర్రు, పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు, కృత్తివెన్ను,బంటుమిల్లి మండలాలలో సుడిగాలి పర్యటన చేసి మండల పరిషత్ పాఠశాలల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు.
తొలుత జిల్లా కలెక్టర్ పామర్రు మండలంలోని అరండల్ పేట-1,2 , కొత్తపేట, నడిచెరువు, పెదమద్దాలి, అంబేద్కర్ కాలనీ, పెదపారుపూడి మండలంలోని మహేశ్వరాపురం, భూషణం గుల్ల గ్రామాల్లోనిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ బాలుర బాలికల పాఠశాలలను పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తో కలిసి పరిశీలించారు.
అనంతరం గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ మండలం తట్టివర్రు, గుడ్లవల్లేరు మండలం లోని చంద్రాల సింగలూరు గ్రామం, కృత్తివెన్ను మండలం చిన పాండ్రాక,కెవిఆర్ నగర్ బంటుమిల్లి మండలం తుమ్మిడి, ఆర్జావానిగూడెం, కామాక్షి పురం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారిలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ గా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా వచ్చి మార్పుల వలన కలిగే ప్రయోజనాలు తెలియజేస్తున్నానన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.
ప్రస్తుత విధానంలో ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు అన్ని తరగతులకు పాఠాలు చెప్పడం జరుగుతుందని అది విద్యార్థులకు భారమయ్యే అవకాశం ఉందన్నారు. అదే గనుక ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం వలన ఎంతో మేలు జరుగుతుందని, బాగా చదువుకొని మంచి జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులకు చదువులో గట్టి పునాది ఏర్పడుతుందన్నారు. పునాది సరిగా లేకపోతే ఉన్నత తరగతులకు వెళ్లే సమయంలో చాలా ఇబ్బందులు పడతారన్నారు. ఒక పాఠశాల నుండి ఇంకొక పాఠశాలకు తరగతులు మార్చినప్పుడు విద్యార్థులు వెళ్లేందుకోసం రవాణా ఖర్చుల కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి నెలకు 500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకొని ముందుకెళ్లాలంటే ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకొని అందరూ సహకరించాలన్నారు. తల్లిదండ్రులందరూ ఈ విషయమై ఒకసారి మరల ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
కొన్నిచోట్ల భవనాలు సరిగా లేక పెచ్చులూడే ప్రమాదం ఉందని మరి కొన్నిచోట్ల ప్రత్యేక గదులు లేవని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పరిస్థితిలో ప్రభుత్వం కల్పించే సమీపంలోని ఇతర పాఠశాలలకు తమ పిల్లలను పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కొన్ని పాఠశాలల్లో చదువు రాక పదవ తరగతి పాస్ కాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
జిల్లాలో 1700 పాఠశాలలు ఉన్నప్పటికీ వారి పాఠశాల కి అదే పనిగా ఎందుకు వచ్చినట్లు ఒకసారి ఆలోచించాలన్నారు. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల నిర్ణయం మేరకే పాఠశాల తరగతులు మార్చడం జరుగుతుందని, వారి అంగీకారం లేకుంటే తరగతులు మార్చడం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నట్లుగానే యధావిధిగా తరగతులు కొనసాగుతాయన్నారు.
ఈ సందర్భంగా పామర్రులోని ఫౌండేషన్ ప్లస్ బాలుర పాఠశాల ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మురికి కాలువలు గుర్రపు డెక్కతో నుండి దుర్వాసన వస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామపంచాయతీ ఈవోకు కాలువలు సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ కాలువ గుడివాడ—పామర్రు అండర్ పాస్ జాతీయ రహదారిలో భాగంగా అనుసంధానమై ఉండటంతో నీళ్లు నిలిచి ఉన్నాయని ఈవో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత జాతీయ రహదారి అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ విద్యా విధానంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఐదో తరగతి వరకు ఇద్దరు ఉపాధ్యాయులతో చదువు మామూలుగా ఉంటుందని అదే కనుక 5 మంది ఉపాధ్యాయులు ఉండడం వలన ఆదర్శవంతమైన పాఠశాల గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా విద్యతో పాటు నీతి కథలు, ఆటలు తదితర ఎన్నో వినూత్న విద్య కార్యక్రమాలు అమలు చేయుటకు వీలుంటుందన్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండడం వలన విద్యార్థులు చాలా బాగా చదువు నేర్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాలను తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకొని ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. అనంతరం వారు మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉన్న గంగానమ్మ చెరువును పరిశీలించి చుట్టూ ఉన్న పిచ్చి చెట్లను, తుంగను వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి పివిజె రామారావు, గుడివాడ ఆర్డిఓ బాల సుబ్రహ్మణ్యం, ఉపవిద్యాధికారి పద్మారాణి, ఎంఈఓ లు పద్మవాణి , శ్రీనివాసు, బాల త్రిపుర సుందరి, ఉపాధ్యాయురాలు మృదుల, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News