మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెమీ మెకనైజ్డ్ విధానంలో యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందామని తెలిపారు. పమిడిముక్కల మండలంలో పటమటలంక, పెనమలూరు మండలంలో చోడవరం, తోట్లవల్లూరు మండలంలో నార్త్ వల్లూరు, రొయ్యూరు వంటి 4 కొత్త రీచ్ లను ఎంపిక చేశామన్నారు. వీటన్నిటికీ త్వరితగతిన టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఇసుక తవ్వకాలను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సెమీ మేకనైజ్డ్ విధానం ద్వారా వినియోగదారులకు సమృద్ధిగా నాణ్యమైన ఇసుక లభించడంతోపాటు ధరలు తగ్గుతాయన్నారు.
రానున్న వర్షాకాలంలో నిర్మాణ అవసరాలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు అన్ని ఇసుక స్టాక్ యార్డులలో సమృద్ధిగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, గనుల శాఖ ఏడి శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ కొండారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News