విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హోటల్ రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి తెలిపారు. గురువారం గుణదలలోని హయత్‌ప్లేస్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు చూసి రాష్ట్రంలో మరిన్ని స్టార్ హోటల్స్ వస్తున్నాయని చెప్పారు. స్టార్ హోటల్స్‌కు ఎక్సైజ్ సుంకం ఏటా 66 లక్షలు చెల్లిస్తున్నామని దానికి తగ్గట్టుగా వ్యాపారాలు ఉండకపోవడంతో నష్టం వస్తున్నదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన తాజాగా గురువారం జరిగిన కేబినెట్‌లో ఎక్సైజ్ సుంకం రూ. 66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి టూరిజంశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గేట్వే హోటల్ అధినేత రాజయ్య మాట్లాడుతూ.. ఏపీలో టూరిజం అభివృద్ధి చెందాలంటే ఐటీ కంపెనీలు పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో సముద్ర తీరం వెంబడి రిసార్ట్స్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని, ఐటీ రంగం కూడా అదే తరహాలో ఏర్పాటు జరిగేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడితే ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉండటం ఖాయమని చెప్పారు. చంద్రబాబు టూరిజంపై రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో 17 స్టార్ హోటల్స్ రానున్నాయని గ్రీన్ హోటల్ అధినేత గోకరాజు గంగరాజు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరడంతో పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు సానుకూలంగా స్పందించి అనుమతులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ హోటల్స్ యజమానులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News