Breaking News

స‌హ‌కార స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌

– అంత‌ర్జాతీయ స‌హ‌కార సంవ‌త్సరం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాలి
– భాగ‌స్వామ్య ప‌క్షాలు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలి
– డీసీడీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐక్యరాజ్య స‌మితి 2025ను అంత‌ర్జాతీయ స‌హ‌కార సంవ‌త్స‌రం (International Year of Cooperatives)
గా గుర్తించిన నేప‌థ్యంలో వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌హ‌కార స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా ఏడాదంతా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం 4వ జిల్లా స‌హ‌కార అభివృద్ధి క‌మిటీ (డీసీడీసీ) స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అనే ఇతివృత్తంతో ఈ ఏడాదిని అంత‌ర్జాతీయ స‌హ‌కార సంవ‌త్స‌రంగా గుర్తించ‌డం జ‌రిగింద‌ని.. సహకార, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్థ‌క త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. సుస్థిర అభివృద్ధి, స‌మ్మిళిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌, సామాజిక‌-ఆర్థిక అస‌మాన‌త‌లను రూపుమాప‌డం త‌దిత‌ర ల‌క్ష్యాల సాధ‌న‌లో స‌హ‌కార రంగం పోషిస్తున్న పాత్ర‌, స‌హ‌కార ఉద్య‌మం ప్రాధాన్య‌త‌, స‌హ‌కార సంఘాల ప్ర‌యోజ‌నాలు త‌దిత‌రాల‌ను తెలియ‌జెప్పేలా స‌ద‌స్సులు, ఎగ్జిబిష‌న్లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, కార్య‌శాల‌లు నిర్వ‌హించాల‌న్నారు. క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, రైతుల‌కు ప‌ర‌ప‌తితో పాటు వివిధ అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాలు (పీఏసీఎస్‌) పోషిస్తున్న పాత్ర‌పై హైస్కూల్ స్థాయిలో వ్యాస ర‌చ‌న పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. డీసీఎంఎస్ పాత్ర‌పై జిల్లాస్థాయిలో వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించాల‌ని సూచించారు. స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్ర‌తి రంగంలోనూ 15 శాతం నిల‌క‌డైన వృద్ధి సాధ‌న‌లో స‌హ‌కార సంఘాలు, స‌హ‌కార సంస్థ‌ల పాత్ర‌పై పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా కాగిత ర‌హిత సేవ‌లు అందించే ల‌క్ష్యంతో పీఏసీఎస్‌ల కంప్యూటరీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని.. జిల్లాలోని 131 పీఏసీఎస్‌ల‌లో 99 పీఏసీఎస్‌ల కంప్యూట‌రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యినందున‌.. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో కంప్యూట‌రీక‌రించి, వాటిద్వారా కూడా ఆన్‌లైన్ సేవ‌లు అందేలా చూడాల‌న్నారు. అదేవిధంగా 1,30,558 మంది ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల స‌భ్యుల్లో 79.87 శాతం మేర ఈ-కేవైసీ పూర్త‌యింద‌ని తెలిపారు. స‌హ‌కార సంఘాల ద్వారా న‌డుస్తున్న నాలుగు పెట్రోల్ బంక్‌లు, అయిదు పీఎం భార‌తీయ జ‌న ఔష‌ధి కేంద్రాల కార్య‌క‌లాపాల్లో పురోగ‌తిపైనా స‌మావేశంలో చ‌ర్చించారు. వీటి అభివృద్ధికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మార్గ‌నిర్దేశం చేశారు.
ఈ స‌మావేశంలో జిల్లా స‌హ‌కార అధికారి, డీసీడీసీ స‌భ్య క‌న్వీన‌ర్ డా. ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో క‌న్న‌మనాయుడు, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, పౌర స‌ర‌ఫ‌రాల మేనేజ‌ర్ ఎం.శ్రీనివాస‌రావు, జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క అధికారి డా. ఎం.హనుమంత‌రావు, కేడీసీసీబీ లిమిటెడ్ జీఎం రంగ‌బాబు, మిల్క్ యూనియ‌న్ ఏజీఎం సీహెచ్ అన్వేష్‌, ఎఫ్‌సీఐ ప్ర‌తినిధి రామ్‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *