Breaking News

వైఎస్సార్ పాదయాత్ర ఒక సంచలనం.. మరపురాని చరిత్ర

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహానేత చేపట్టిన పాదయాత్ర 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఐక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రలోనే ఈరోజు ఒక ముఖ్యమైన తేదీగా నిలిచిపోయిందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను, రైతుల పట్ల అధికార తెలుగుదేశం పార్టీ ఉదాసీనతను ఎత్తిచూపడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 60 రోజుల పాటు 1,500 కి.మీ. పాదయాత్ర చేపట్టారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నేటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా 11 జిల్లాల్లో సాగిన పాదయాత్ర శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో ముగిసిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై వైఎస్‌ఆర్‌ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు ఎందరో ఉంటారని.. కానీ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే అని కీర్తించారు. ఆయన జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, పెన్షనర్ల సాధక బాదకాలు గుర్తించి వారి కష్టాలను తీర్చిన ప్రజానేత అని పేర్కొన్నారు. మాట తప్పని మడమతిప్పని ఆయన నైజం పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఈసడించినా.. దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన నాయకులు వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. జలయజ్ఞం ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పోలవరం, పులిచింతల, డెల్టా ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన చేసిన కృషి వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీనిచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీ అమలుపై తొలి సంతకం చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారికి, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు 108 సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని మల్లాది విష్ణు అన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు సహా 942 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 సార్లు అధికారిక పర్యటనలు చేసిన ఘనత ఒక్క వైఎస్ కే దక్కుతుందన్నారు. పేదలకు JNNURM ఇళ్లు, నూజివీడులో ట్రిపుల్ ఐటీ, మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫైఓవర్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ నగర రూపురేఖలను పూర్తిగా మార్చివేశారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *