Breaking News

భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం

-వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తిచేస్తాం
-మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల, ఆ కలను నెరవేర్చే అవకాశం దక్కింది
-చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
-40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ శంకుస్థాపన
-40 ఏళ్ల తర్వాత మంగళగిరి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం మంగళగిరి మండలం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిర్వహించిన శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర హెచ్ఆర్డి , ఐటి ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ , జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ , శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర హెచ్ఆర్డి , ఐటి ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల మధ్య కూటమి నేతలతో కలిసి మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భవన నమూనా చిత్రాలను పరిశీలించి నేతలకు వివరించారు. కూటమి నేతలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1984లో స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారు వైవీసీ(యార్లగడ్డ వెంకన్న చౌదరి) క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద మంత్రి నారా లోకేష్ సెల్ఫీ దిగారు.

మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల. ఆ కలను నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది. అందరి సహకారంతో నిర్మిస్తాం. 1984లో మంగళగిరి పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, ఈ ప్రాంగణంలో క్యాన్సర్ చికిత్స కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. మంగళగిరి ఆసుపత్రిని కూడా నిర్మించారు. లక్షలాది మందికి వైద్యం అందించడం జరిగింది. మంగళగిరి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని ఇక్కడి ప్రజలను నన్ను కోరడం జరిగింది. ఆసుపత్రి కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిశారు. ఇప్పుడున్న స్థలంలో కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సువిశాల ప్రాంగణం ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం
వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై అనేకసార్లు సమీక్షించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే భవన నమూనాలు ఖరారు చేయడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. జోనింగ్, స్టాఫింగ్, మెరుగైన సౌకర్యాలు అందిస్తాం. అమరావతి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ ఆసుపత్రికి రద్దీ కూడా బాగా ఉంటుంది. ఆర్థో, డయాలసిస్ సెంటర్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం. తలసేమియా, డీ అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటుచేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో కేబినెట్ మీటింగ్ లోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని కేటాయించడం జరిగింది.

అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఒక నిర్ణయం జీవితాన్ని మార్చివేస్తుంది. నా జీవితంలో తీసుకున్న నిర్ణయం మంగళగిరిలో పోటీచేయడం. 2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ రోజు నుంచి కసితో పనిచేసి ప్రజలకు దగ్గరయ్యాను. 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. మీరు ఎంత మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడు చెప్పడం జరిగింది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 91వేల ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. కేబినెట్ లో ఎప్పుడు మంగళగిరి ప్రస్తావన వచ్చినా చర్చే ఉండదు. ఏది అడిగినా శాంక్షన్ చేయాలని మంత్రులు నాకు మద్దతుగా నిలుస్తారు. ఇందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ఎన్నికల ముందు మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మంగళగిరిని అభివృద్ధి చేస్తాం.

మంగళగిరి నియోజకవర్గానికే నా మొదటి ప్రాధాన్యత
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రేపు కూడా మంగళగిరేనా అని అన్నారు. రాష్ట్రమంతా తిరగాలని అన్నారు. 2019 ఎన్నికల్లో నా పరువు పోయింది, ఓడిపోయాను. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. వారి నుంచి శబ్ధం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలని చెప్పాను. అందుకే నాకు ప్రయార్టీ ఉందని చెప్పాను. ప్రజలు నాపై బాధ్యత పెట్టారు. భరోసాతో మీరు ఉన్నారు. రచ్చబండలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి. భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, పవర్ అందిస్తాం. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలు అందిస్తున్నాం. ఇళ్లు లేని వారికి నిర్మించి ఇస్తాం. ఇవన్నీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం.

మంగళగిరి అన్ని రంగాల్లో నెం.1గా ఉండాలి
మంగళగిరి అన్ని రంగాల్లో నెం.1గా ఉండాలి. ప్రజలపై కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలి. మంగళగిరిని చెత్తరహిత నగరంగా నిలపాలి. మంగళగిరిలో వెయ్యి టన్నుల చెత్త బయటపడింది. స్వచ్ఛతలో కూడా మంగళగిరి నెం.1గా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి. పారిశుద్ధ్య కార్మికులు కూడా బాగా పనిచేస్తున్నారు. ఏడాది సమయ ఇస్తున్నా. తర్వాత నేనే కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరి ఇంటి ముందైనా చెత్త ఉంటే వారితో పాటు నేను కూడా చెత్త ఎత్తుతా. స్వచ్ఛత, ఆరోగ్యంలో నెం.1గా ఉండాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. మంగళగిరి ప్రజలకు డయాబెటిస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ ల ద్వారా ఈ విషయం తెలిసింది. ప్రతిరోజూ వాకింగ్ చేయాలని చెప్పా. పార్క్ లు కావాలని అడిగారు. ఇటీవల ఎస్ఎల్ఎన్ పార్క్ ను ప్రారంభించాం. మంగళగిరిలో 30 పార్క్ లు, చెరువులు అభివృద్ధి చేస్తాం. కల్యాణ మండపాలు నిర్మిస్తాం.

భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం
వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తి చేస్తాం

ఈ రోజు నుంచి వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తిచేసే బాధ్యత ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుపైన ఉంది. లేనిపక్షంలో పక్కనే ఉన్న పవనన్నకు ఫిర్యాదుచేస్తా. కమిటీ సభ్యులకు కూడా బాధ్యత ఉంది. పోరాడి తెచ్చుకున్నారు. మీ పర్యవేక్షణలో నిర్మాణం జరగాలి. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తాం. భారతదేశానికే ఆదర్శంగా వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల. ఆ కలను నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది. అందరి సహకారంతో నిర్మిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ మాజేటి వంశీకృష్ణ, డాక్టర్ కేవీఎస్ సాయిప్రసాద్, డాక్టర్ మాగంటి ప్రసాద్, డాక్టర్ రాజు నాయుడు, డాక్టర్ శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *