-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు చేసిన కృషి చిరస్మరణీయడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే ప్రపంచంలో భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. అంబేద్కర్ అణగారిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పేరొందారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విధులు నిర్వర్తించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంబేద్కర్ చిన్నతంలోనే అంటరానితనానికి గురయ్యారన్నారు. ఆనాడే ఆయన అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అంటరాని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితేనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాధించిన మహానీయుడు అంబేద్కర్ అని మంత్రి తెలిపారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని భావించిన తొలి వ్యక్తి అంబేద్కరన్నారు. అంబేద్కర్ ముందు చూపు వల్లే నేడు అణగారిన వర్గాలు గౌరవ ప్రదమైన జీవనం సాగిస్తున్నాయన్నారు. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసిందన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తిస్తూ…1990లో అప్పటి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు భారత రత్నను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 1891 ఏప్రిల్ 14న జన్మంచిన అంబేద్కర్ 1956 డిసెంబరు 6న కన్నుమూశారన్నారు. అంబేద్కర్ సేవలు, పట్టుదల, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన కారణంగానే భారతదేశం సురక్షితమైన పాలకుల చేతిలో ఉందన్నారు. నిరంకుశ పాలకుల కోరలను ఓటు అనే వజ్రాయుధంతో పీకే శక్తిని ప్రజలకు అంబేద్కర్ ఇచ్చారన్నారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబునాయుడు… సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల అభ్యున్నతికి, పీ-4కు శ్రీకారం చుట్టారని మంత్రి సవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, పలువురు డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News