-పి-4 ప్రారంభోత్సవం జరిగిన ప్రాంతం నుండే ప్రధాని చేతుల మీదగా అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభం
-సోమవారం ఉ.11గం.లకు సచివాలయంలో ఏర్పాట్లపై మంతృల బృందం సమీక్ష
-ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాట్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభించేందుకు రానున్నారని అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఈమేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్,కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,పి.నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించిందని ఈకమిటీ సోమవారం ఉ.11.గంలకు అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై నిర్వహించనుందని పేర్కొన్నారు.రాష్ట్ర సచివాలయం వెనుకవైపున ఇటీవల పి-4 కార్యక్రమం ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని కార్యక్రమ సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని పర్యటన మే 2వ తేదీకి నిర్ధారణ(conform) అయిందని అయితే ఆ కార్యక్రమం ఉదయం నిర్వహించాలా లేక సాయంత్రం నిర్వహించాలా అనేది ఖరారు కావాల్సి ఉందని అన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు గురువారం తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇటీవల కాలంలో విశాఖలో జరిగిన ప్రధాని పర్యటన కార్యక్రమంలో విధులు నిర్వహించిన అధికారులకు ఈసారి కూడా తగిన విధులు కేటాయించడం జరుగుతుందని ఆ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజా ప్రతినిధులు,ప్రజలు తదితరు లెవరికీ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో కనీస సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ అధికారులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా వివిధ గ్రామాల మీదగా ప్రముఖులు,సాధారణ ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉందని ఆయా రోడ్లన్నీ గ్రామీణ రహదారులై ఉన్నందున ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.మొత్తం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ ను నోడలు అధికారిగా నియమించడం జరిగిందని కావున అధికారులు అందరూ ఆయనతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో పాల్గొనే విఐపిలు,ఇతర ప్రముఖుల వివరాలను పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆయా శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు ఇతర అంశాలకు సంబంధించి తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని చెప్పారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడలు అధికారిగా నియమించబడిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ సచివాలయం వెనుక వైపున పి-4 కార్యక్రమం జరిగిన ప్రాంతంలో ప్రధాని సభావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని అక్కడి నుండే ప్రధాని మోడి పలు పనులకు ప్రారంభోత్సవాలు,శంఖుస్థాపనలు చేయను న్నారని వివరించారు.ప్రధాని సభలో సుమారు 5లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నామని ప్రధాన వేదిక వద్ద 50వేల మంది కూర్చునే విధంగాను,మరో లక్షల మంది రోడ్లు వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికే విధంగా,మిగతా వారు వివిధ ప్రాంతాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.విఐపిలు,ప్రజలు తదితరులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదార్లను గుర్తించడం జరగిందని ఆయా రహదార్లలో ఎక్కడా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి కృష్ణా,గుంటూరు,ఏలూరు,ప్రకాశం సమీప జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ప్రధాని సభలో పాల్గోనేలా మిగతా జిల్లాల నుండి తగిన విధంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వీరపాండ్యన్ తెలిపారు.
ఈసమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి హరి నారాయణ,సిఆర్డిఏ అదనపు కమీషనర్లు నవీన్,సూర్య ప్రవీణ్,ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గుంటూరు,ఎన్టిఆర్,కృష్ణా జిల్లాల కలక్టర్లు,వివిధ శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News