ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
“భారతదేశం గ్లోబల్ ఎకానమీ లో : తదుపరి దశాబ్దం” అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు తొలి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అయిన డా. అరవింద్ పనగారియా తమ అమూల్య సందేశం అందించారు.
గురువారం స్థానిక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (ఐఐటీ తిరుపతి) ను సందర్శించి, హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్ విభాగం వారు నిర్వహించిన సమావేశం లో 16వ ఆర్థిక సంఘం సభ్యులు మరియు ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ మనోజ్ పాండా, అలాగే ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ గారు భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత భారత్) మారే దిశగా ఎకానమీ స్థితిని విశ్లేషిస్తూ, ప్రస్తుతం అమెరికా డాలర్లలో 2,540 అయిన భారత జాతీయ ఆదాయం (GNI) 8 రెట్లు పెరిగి, భారత్ మిడిల్ ఇన్కం నుండి హై ఇన్కం ఎకానమీగా మారాలని చెప్పారు. దీన్ని సాధించాలంటే, వచ్చే 24 సంవత్సరాల్లో సగటు వృద్ధిరేటు 7.8% ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గత రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8–9% వృద్ధి రేటు సాధించిందని గుర్తుచేసి, భవిష్యత్తులో మరింత స్థిరమైన అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని అన్నారు.
భవిష్యత్తులో భారత వృద్ధికి మద్దతిచ్చే మూడు ముఖ్య అంశాలను ఆయన వివరించారు:
1. తక్కువ ఆదాయం నుండి అధిక ఆదాయం వైపు మార్పు: చైనా మరియు కొరియా లాంటి దేశాల మార్గాన్ని అనుసరించి, భారతదేశానికి అభివృద్ధికి అవకాశం ఉంది.
2. డెమోగ్రాఫిక్ డివిడెండ్: యువ జనాభా ఆధారంగా ఎక్కువ పొదుపు, మెరుగైన సేవల అందింపు, మరియు ఉత్పాదకత పెరుగుతుంది.
3. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సంస్కరణలు: ప్రజాస్వామ్యంలో సంస్కరణలు నెమ్మదిగా జరుగుతాయి కానీ, భారత్ పట్టుదలగా ముందుకు సాగుతోంది. అటల్ సెతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు.
తక్కువ ఉత్పాదకత కలిగిన మైక్రో ఎంటర్ప్రైజెస్ నుండి కార్మికులను ఎక్కువ ఉత్పాదకత కలిగిన రంగాల వైపు తరలించాల్సిన అవసరం ఉందని, ఇది ప్రైవేట్ రంగం మరియు విధాన సంస్కరణల ద్వారా సాధ్యమవుతుందని వివరించారు. ముఖ్యంగా కార్మిక మరియు భూమి సంస్కరణలు అత్యవసరమని పేర్కొన్నారు.
ప్రశ్నోత్తర సమావేశంలో, తయారీ రంగం వృద్ధిలో ఆలస్యం జరిగిందని, దీనికి కారణంగా కఠిన కార్మిక చట్టాలను చెప్పారు. మీడియం ఎంటర్ప్రైజెస్ పెరగాలని, పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ అవసరమని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణ మరియు శక్తి భద్రత కోసం పునరుత్పాదక ఇంధన వనరులను వాడడం ద్వారా, భారత్ సుస్థిర అభివృద్ధిని కొనసాగించవచ్చని చెప్పారు. రాబోయే దశాబ్దంలో భారతదేశం $9–10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ ఐఐటీ తిరుపతిలో జరుగుతున్న మార్పులు, పరిశోధన మరియు నావీన్యానికి కేంద్రంగా రూపుదిద్దుకున్న ఈ మూడవ తరం ఐఐటీ పురోగతిని వివరించారు. విద్యార్థులలో మూడవ వంతు మంది పీహెచ్.డి. ప్రోగ్రాములలో ఉన్నారని, అధ్యాపకులు 200 కి పైగా పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని తెలిపారు. మెటీరియల్ సైన్స్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ స్టోరేజ్, ఫుడ్ టెక్నాలజీ, ప్రిసిషన్ టెక్నాలజీ వంటి ఇంటర్డిసిప్లినరీ రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వివరించారు.
Prajavartha Online Telugu News