
– క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు
– అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి
– సేవా దృక్పథంతో పేదలకు చికిత్సలను అందించాలి
– సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శంకుస్థాపన సందర్భంగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
– పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలందించడంలో సిటిజెన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్ష
– రాష్ట్ర మంత్రి పార్థసారథిచే సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతోందని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణాజిల్లా ముళ్లపూడిలో నిర్మించబడుతున్న సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు ఆదివారం ఆమె వర్చువల్ విధానంలో శంకుస్థాపన జరిపారు. పటమట కృష్ణవేణి స్కూల్ రోడ్డులోని సిటిజెన్ ఫోర్స్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి ప్రసంగిస్తూ.. క్యాన్సర్ చికిత్సల్లో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్సలందించేందుకు సిటిజెన్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలందించడంలో సిటిజెన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. వైద్య రంగంలో సేవా దృక్పథం వృద్ధి చెందాలని, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సంపూర్ణ ఆరోగ్య భారతం ఆవిష్కరించబడుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో క్యాన్సర్ సంరక్షణకు అంత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లు కేటాయించగా, ఆరోగ్య పరిశోధన శాఖకు రూ.3,900.69 కోట్లు కేటాయించారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 200 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. క్యాన్సర్ తదితర అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే వివిధ ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తిగా మినహాయించారని చెప్పారు. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పురంధేశ్వరి వెల్లడించారు. వైద్యో నారాయణో హరిః అని డాక్టర్లను దేవుళ్లుగా చూసే మన దేశ మహోన్నత సంస్కృతిని మరింత దృఢపరిచే విధంగా సేవా దృక్పథంతో సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ వైద్య సంస్థకు రూపకల్పన చేసిన పి. రమేష్ బాబు, తట్టి అర్జునరావులకు ఎంపీ పురంధేశ్వరి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లినిక్ ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు అత్యున్నత శ్రేణి క్యాన్సర్ వైద్య సేవలను అందించేందుకు సిటిజెన్ ఫోర్స్ ముందుకురావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం, సిటిజెన్ ఫోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం స్వచ్ఛందంగా క్యాన్సర్ వైద్య వికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తి సేవాభావంతో పేద ప్రజల పాలిట సంజీవనిగా సిటిజెన్ ఫోర్స్ హాస్పిటల్ సేవలందిస్తుందని అన్నారు. బంగారం స్వచ్ఛతకు హాల్ మార్క్ లాగా.. వైద్య రంగంలో స్వచ్ఛతకు ప్రామాణికంగా సిటిజెన్ ఫోర్స్ నిలుస్తుందని రమేష్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, వర్ల కుమార్ రాజా, బీజేపీ ఏపీ మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, దేవినేని అపర్ణ, సిటిజన్ ఫోర్స్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ కె. వంశీకృష్ణ, డాక్టర్ కె. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News