-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో పెత్తందార్లు దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేయడం దుర్మార్గం. విద్యుత్ఘాతంతో మరణించిన దళిత యువకుడి కుటుంబానికి పెద్దలు రాజీ కుదిర్చిన మేరకు పరిహారం ఇవ్వకపోగా, పెత్తందార్లు దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాగరిక సమాజంలో ఇటువంటి సామాజిక రుగ్మతలు, సాంఘిక బహిష్కరణలు గర్హనీయం. ఈ రోజు సిపిఐ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల కార్యదర్శులు కామ్రేడ్స్ టి.మధు, బోడ కొండ తదితర సిపిఐ ప్రతినిధి బృందం మల్లాం గ్రామం వెళ్లి దళితులను పరామర్శించడం జరిగింది. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి, ఈ ఘటనపై తగు చర్యలు చేపట్టాలి. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి. సామాజిక బహిష్కరణ అమలు చేసిన పెత్తందార్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం.
Prajavartha Online Telugu News