-బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి సుభాష్
రామచంద్రపురం/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బైసరన్, పహల్గామ్ లో విహరిస్తున్న పర్యాటకులు, స్థానికులపై మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నారని అన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు, 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొని, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్యగా పేర్కొన్నారు. మానవత్వం, శాంతి, కాశ్మీర్ ఆతిథ్య స్ఫూర్తిపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మంత్రి సుభాష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడినవారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. నాగరిక సమాజంలో ఇటువంటి హింసకు స్థానం లేదన్నారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన నర హంతకులును న్యాయస్ధానం ముందుకు తీసుకురావాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో సంఘీభావంగా భారత్ ఎల్లప్పుడూ ఐక్యంగా నిలుస్తుందన్నారు.
Prajavartha Online Telugu News