-ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించిన వైద్య,ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన ప్రాంతాల్లో గుర్తించిన మలేరియా హాట్ స్పాట్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. ఈనెల 25న జరుపుకునే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్లను గురువారం నాడు వెలగపూడి ఏపీ సచివాలయంలోని వైద్య,ఆరోగ్య శాఖ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి గిరిజన ప్రాంతాల్లో గుర్తించిన మలేరియా హాట్ స్పాట్‌లలో మలేరియా కేసులు తగ్గాయా, పెరిగాయా సమాచారం ఆధారంగా తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక ఏజెన్సీని నియమించడం ద్వారా హాట్ స్పాట్ లలో మలేరియా కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ మలేరియా నివేదిక 2022 ప్రకారం 2021లో మలేరియా జ్వరంతో 6,19,000 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, మరియు ఏలూరు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1783 మలేరియా కేసులు నమోదుకాగా, ఒక్క మరణం కూడా సంభవించలేదన్నారు. దేశ వ్యాప్తంగా 15,457 కేసులు నమోదు కాగా, ఒక మరణం నమోదయ్యిందన్నారు.
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమం డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News