-పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల మూలంగా పంటలు ధ్వంసం కావడం, కొందరు రైతులు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలే తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఒక కౌలు రైతు ఏనుగుల దాడిలో చనిపోవడం, తాజాగా పాకాల మండలం గానుగపెంటలో పంటలు ధ్వంసం చేసిన ఘటనలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏనుగుల మూలంగా ప్రజలకు, ప్రజల మూలంగా ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. ఏనుగుల మందలు అటవీ ప్రాంతాల నుంచి సమీప గ్రామాలకు అడవుల్లోకి వచ్చేస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అటవీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎలిఫెంట్ కారిడార్ లో భాగంగా ఏనుగుల మందలు, ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు ఎలిఫెంట్ ట్రాకర్స్ సేవలు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తక్షణమే ఏర్పాటు చేయాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు.
తిరుపతి డి.ఎఫ్.ఓ. అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలను అనుసరించి తిరుపతి డి.ఎఫ్.ఓ. పి.వివేక్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. చిత్తూరు డి.ఎఫ్.ఓ. ఎస్.భరణితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించిన పీలేరు, తిరుపతి డి.ఎఫ్.ఓ.లు, తిరుపతి సబ్ డి.ఎఫ్.ఓ.లతోపాటు తిరుపతి భాకరపేట, పనపక్కం, చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్ పరిధిలో ఎఫ్.ఆర్.ఓ.ల టీమ్స్, పది మంది ఎలిఫెంట్ ట్రాకర్స్ ఈ టాస్క్ ఫోర్సులో ఉంటారు. వీరి బాధ్యతలను కూడా నిర్దేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
Prajavartha Online Telugu News