-జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, పర్యటన విధులు నిర్వహించే రూట్ ఆఫీసర్లు, లైజనింగ్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రానున్న దృష్ట్యా అందరి భాగస్వామ్యంతో పర్యటనను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్యాబినేట్ సబ్ కమీటి ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించి దశ దిశ నిర్థేశిస్తున్నారన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో సభా వేదికకు జిల్లా నుండి బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా రైతులు, పారిశ్రామిక వేత్తలు, విద్య వైద్య వివిధ రంగాలకు చెందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాలన్నారు. వివిధ ప్రాంతాల నుండి బయలు దేరే బస్సులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్‌టిఆర్ జిల్లా నుండి సుమారు లక్ష మంది కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో త్రాగునీరు, ఆహారం, తదితర అవసరాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణకు స్థానిక కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాట్ల సమన్వాయానికి ప్రత్యేక అధికారులకు భాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. అధికారలు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమిష్టి భాగస్వామ్యంతో గౌరవ ప్రధాన మంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రధాన మంత్రి పర్యటనకు జిల్లా నుండి చేసిన ఏర్పాట్లను మంత్రికి వివరించారు. జిల్లా నుంచి ప్రధాన కార్యక్రమ వేదికకు చేరుకునేందుకు ఉన్న మార్గాలు, వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసిన బస్సులు, ప్రతి బస్సుకు ఏర్పాటు చేసిన ఇన్‌చార్జ్‌లు, ప్రజలకు కల్పించిన సౌకర్యాలు, వైద్య శిభిరాలు, తదితరల అంశాల మొబలైజేషన్ ప్రణాళికను ఇన్‌చార్జ్ మంత్రికి వివరించారు.
సమన్వయ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ హెచ్. ఎం. ధ్యానచంద్ర, డిఆర్‌వో ఎం. లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్‌డివో కె. చైతన్య, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News