గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుళ్ళూరు మండలం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మే 2వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొననున్నందున విధులు కేటాయించిన అధికారులందరు పటిష్ట ప్రణాళికతో బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు.
మంగళవారం రాత్రి కలక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనకు సంబంధించి విధులు కేటాయించిన అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ , జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించే కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తో పాటు ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నందున హెలిప్యాడ్ వద్ద , ప్రధాన మంత్రి ప్రయాణించే మార్గాల్లో , వేదిక వద్ద , గ్యాలరీ లలో విధులు కేటాయించిన అధికారులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. హెలిప్యాడ్ వద్ద , ప్రధాని ప్రయాణించే మార్గాల్లో రోడ్డు షో కు అనుగుణంగా ఆర్ అండ్ బి అధికారులు పటిష్టంగా బారీకేట్స్ ఏర్పాటు చేయాలని , యం వీఐపీ లు ప్రయాణించే మార్గాల్లో విద్యుత్ వైర్లు లేకుండా విద్యుచ్ఛక్తి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు అవుతున్న నేపధ్యంలో గ్యాలరీ లకు ఇన్ చార్జ్ లుగా నియమించిన అధికారులు మంచి నీటి సరఫరా , వైద్య సిబ్బంది , శానిటేషన్ సిబ్బంది అందుబాటులో వుంచుకునేలా ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. సభకు బస్సుల్లో తరలివస్తున్న ప్రజలకు మధ్యాహ్న సమయంలో నిర్దేశిత ట్రాన్టిస్ట్ పాయింట్ వద్ద లంచ్ ప్యాకెట్లు , సాయంత్రం సభ ముగిసిన తరువాత పార్కింగ్ ప్రాంతాల్లో డిన్నర్ ప్యాకెట్లు అందించేలా రవాణా , ఆర్టీసీ , మెప్మా , డిఆర్డీఏ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి కార్యక్రమానికి విచ్చేసే ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ ముగిసిన అనంతరం సురక్షితంగా ఇళ్లకు వెళ్ళేలా అధికారులందరు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో విధులు కేటాయించిన రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ , రవాణా, అగ్నిమాపక , మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News