-రాజధాని అమరావతితోనే రాష్ట్ర భవిష్యత్తు
-మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి
-పునర్నిర్మాణ సభ విజయవంతం చేసి అమరావతికి మద్ధతు తెలుపుదాం
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న… ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనే… అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేద్దామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రధాని సభను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్, దుగ్గిరాల ప్రాంత కూటమి నేతలతో మంగళవారం నాడు… తాడేపల్లి, దుగ్గిరాలల్లో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు దిశా నిర్దేశం చేసిన మంత్రి గొట్టిపాటి.., సభను విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాజధాని అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ ప్రజలందరినీ జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణంతోనే ఆంధ్రప్రదేశ్ యువతకు భవిత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ బాధ్యత తీసుకున్నారని ఆయన వెల్లడించారు. రాజధానిలో కీలక ప్రాంతాలైన తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్ లతో పాటు దుగ్గిరాల ప్రాంతం నుంచి ప్రతి కుటుంబం అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా మే 2వ తేదీ జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాజధాని అమరావతికి మద్ధతు తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా భారీ ఎత్తున జరిగే పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా తరలి వచ్చే కూటమి కార్యకర్తలతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధకృష్ణతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News