-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తులను నాణ్యతతో చేపట్టాలని, అలాగే వాటికి సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను నిర్దేశించిన గడువులోపు పంపించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలల అధికారులు, ఇంజినీరింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కనీస మౌలిక వసతుల కోసం అవసరమైన మరమ్మత్తులకు ప్రత్యేక నిధులు కేటాయించినందున, వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
సంబంధిత శాఖలు మరమ్మత్తుల అవసరాలను గుర్తించి, అవసరమైన నిధుల అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనంగా అవసరమైన నిధులు సిఎస్ఆర్, ఎంపీ లాడ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) ద్వారా సమీకరించి మరమ్మత్తులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వసతి గృహాల్లో మరుగుదొడ్ల మరమ్మత్తులు, రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా, ప్రతి కొళాయికి ట్యాప్ ఏర్పాటు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బులు, వంటగదికి ఎగ్జాస్ట్ ఫ్యాన్, స్టోర్‌కు మెష్, కిటికీలకు దోమల మెష్, తలుపులు, లీకేజీ రహిత గదులు, ఫ్లోరింగ్, RO త్రాగునీటి ప్లాంట్ లాంటి పనులు నాణ్యతతో, లోపంలేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. నాసిరకం మెటీరియల్‌ను వాడరాదని స్పష్టం చేశారు.
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల మరమ్మత్తుల నిమిత్తం ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు నిధులను సకాలంలో వినియోగించి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అధికారులు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పూర్తయిన వసతి గృహాలను స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభించాలన్నారు. బాలికల వసతి గృహాలకు ప్రహరీ గోడల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రం కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల సుబ్రమణ్యం రెడ్డి (ఏపీ EAPWIDC), జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజాసోము, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (ఇంచార్జి) వెంకటేశ్వరరావు, జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి, మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త రేష్మ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త గీత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెల్లూరు, అసిస్టెంట్ సంక్షేమ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News