అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది.ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించబడిన పయ్యావుల కేశవ్,పి.నారాయణ,కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం గురువారం సభా వేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది.అనంతరం ప్రధాన సభా వేదికను వారు పరిశీలించి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈసందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాని స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఆప్రకారం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్చార్జిగా పెట్టడంతో పాటు 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్చార్జి అధికారిని నియమించి ఎక్కడా ఎటువంటి ఆటకం కలగకుండా సభా స్థలికి చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. బస్సులు బయలుదేరే సమయంలోనే ఆల్పాహారం,తాగునీరు,దారి మధ్యలో మధ్యాహ్న భోజనం కల్పించడంతో పాటు సభా ప్రాగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్ ప్రాంతాల్లో కూడా భోజన వసతి కల్పించడమేగాక సభానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి భొజనం కూడా అందించడం జరుగుతుందన్నారు.పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరిలో కలిగేలా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34వేల ఎకరాలను ఇచ్చారని వారందరినీ ఈకార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుందని ఆదిశగా పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు.
రాష్ట్ర పౌర సరఫరాల శామాత్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి వారి కార్యక్రమానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.అమరావతి రాజధాని మనది అనే భావన అందరిలో కలిగి అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు ఈకార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని తెలిపారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాలకు చెందిన రైతులు 34వేల ఎకరాలను స్వచ్చంధంగా ముందుకు వచ్చి ఇస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడి అమరావతి రాజధానిని సర్వనాశసం చేశారని అన్నారు.మరలా అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.
అనంతరం ప్రధాని సభ ప్రధాన వేదిక,అమరావతి రాజధాని ఫైలాన్ తదితర ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది.ఈకార్యక్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల రాష్ట్ర నోడలు అధికారి జి.వీరపాండ్యన్,సియం కార్యదర్శి ప్రద్యుమ్న,గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News